యాదగిరిగుట్ట, మే 13 : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు ఈ నెల 15న (గురువారం) మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు వారు స్వామివారిని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. మంగళవారం యాదగిరిగుట్ట ఆలయ ప్రాంతాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులతో సమీక్ష జరిపి పలు సూచనలు చేశారు. దర్శనానికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు రాకుండా చూడాలన్నారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ సుందరీమణులు కొండపైన వీవీఐపీ అతిథి గృహం నుంచి అఖండ దీపారాధనలో పాల్గొని, తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం ఉంటుందని తెలిపారు. దేవస్థాన టూరిజానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు. ప్రపంచ సుందరీమణుల పర్యటనతో యాదగిరిగుట్ట ఆలయం ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఈఓ వెంకటరావు, డీఈఓ దోర్బల భాస్కరశర్మ, ఈఈలు వూడెపు రామారావు, దయాకర్‌రెడ్డి, ఇన్చార్జి తాసీల్దార్ దేశ్యా పాల్గొన్నారు.