– పర్యావరణ పరిరక్షణ వేదిక
రామన్నపేట, ఏప్రిల్ 01 : అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అనుమతులు లేకుండా అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు చేస్తే మరో మహా ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ హెచ్చరించారు. రామన్నపేట అంబుజా సిమెంట్ ప్రతిపాదిత స్థలంలో భారీ యంత్రాలతో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పనులను బుధవారం పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్షాల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పరిశీలించి పనులు ఆడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జల్లెల పెంటయ్య, ఎండీ రెహన్ మాట్లాడుతూ.. కాలుష్యంతో ప్రజల ప్రాణాలు తీసే అంబుజా సిమెంట్ పరిశ్రమ నెలకొల్పవద్దని మండల ప్రాంత ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేయగా వెనక్కి తగ్గి మళ్లీ ఎదో సాకుతో పనులు ప్రారంభించడం సరికాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా భారీ యంత్రాలతో పనులు జరుపుతున్నారని ఏ నిర్మాణానికి అనుమతి ఉన్నదో ప్రజలకు, మీడియా ముందు బహిరంగంగా చూపించాలని, స్థానిక గ్రామ పంచాయతీకి సమాచారం అందించాలన్నారు.
దొడ్డి దారిన పనులు ప్రారంభిస్తే ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరని మరో ప్రతిఘటన పోరాటం తప్పదన్నారు. రైతులకు మాయమాటలు చెప్పి నమ్మించి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి కాలుష్యంతో పర్యావరణం దెబ్బతీసే అంబుజా సిమెంట్ పరిశ్రమను నెలకొల్పాలని చూస్తుంటే ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ముక్తకంఠంగా వ్యతిరేకించారని దీనిపై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలని అడ్డదారిలో భారీ యంత్రాలతో పనులు చేస్తే సహించమని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ వేదిక అఖిలపక్షాల నాయకులు గోదాస్ పృథ్వీరాజ్, ఊట్కూరు నర్సింహా, ఎండీ జమీరూద్దీన్, మిర్జా ఫజల్ బెగే, శానగొండ వెంకటేశ్వర్లు, కొమ్ము శేఖర్, మోట మహేశ్, సుదర్శన్, కొమ్ము రామస్వామి, అంబాల అశోక్, గురిజాల మహేష్ రెడ్డి, జల్లెల మల్లేష్, సమ్మయ్య, శీను, వీరమళ్ల లింగస్వామి, ఆకిటి శేఖర్, కల్లూరి శివ పాల్గొన్నారు.