సంస్థాన్ నారాయణపురం,సెప్టెంబర్4 : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి వాగులు పారి చెరువులు నిండి అలుగులు పారుతుంటే సంస్థాన్ నారాయణపురం మండలంలో మాత్రం చెరువుల్లో చుక్క నీరు లేకుండా పోయింది. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక పంట పొలాలు ఎండిపోతున్న వింత పరిస్థితి నెలకొన్నది. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో చెరువులు నెర్రెలుబారాయి.
పాతాల గంగ అడుగంటి పోవడంతో బోర్లు సన్న ధారగా పోస్తున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న 120 చెరువుల్లోకి చుక్క నీరు చేరకపోవడంతో వెలవెల బోతున్నాయి. ఈ ఏడాది వర్షాలు కురువాలని ప్రతి గ్రామంలో ప్రజలు కప్ప కాముడు, బొడ్రాయికి నీళ్లతో అభిషేకాలు చేశారు. ఎన్ని పూజలు చేసినా దేవుడు కరుణించడం లేదని, వర్షాలు పడడం లేదన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి వేసిన పంటలు చేతికి వస్తాయో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలోనైనా సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండుతాయని ప్రజలు ఎంతో అశతో ఎదురు చూస్తున్నారు.
నాలుగు ఎకరాలు పడావు పెట్టిన
నాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పంట చేతికి వచ్చిన ప్రతి సారి అన్ని ఖర్చులు పోను లక్ష రూపాయలు చేతికి వచ్చేవి. నాకు ఊహ తెలిసి ఇప్పటి వరకు మా భూమిని పడావు పెట్టలేదు. వర్షాలు లేక చెరువుల్లో చుక్క నీరు లేక పోవడంతో బోరు ఎండిపోయింది. నీళ్లు లేక పోవడంతో నాలుగు ఎకరాలను పడావు బెట్టిన. దేశమంతా వర్షాలు పడుతుంటే మా దగ్గర వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
-చిలువేరు భిక్షం, రైతు, సంస్థాన్ నారాయణపురం
రామానంద తీర్థలో టెక్నికల్ కోర్సులకు దరఖాస్తులు
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 4 : మండలంలోని జలాల్పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా సాంకేతిక శిక్షణకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ పీఎస్ఎస్ఆర్ లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల కాల పరిమితితో కూడిన బేసిక్ కంప్యూటర్స్ (డాటా ఎంట్రీ ఆపరేటర్ ) కోర్సుకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అర్హులని పేరొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్, జీరాక్స్ సెట్, పాస్ ఫొటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. వివరాలకు 9133908000 , 9133908111 , 9133908222 , 9948466111 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.