ఆలేరు టౌన్, జూలై 19 : పాలకుల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆలేరును అభివృద్ధి చేసుకోవాలంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించుకుంటే తప్పా అభివృద్ధి జరగదని వక్తలు ఉద్ఘాటించారు. ఆలేరులోని వై ఎస్ ఎన్ గార్డెన్లో ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం మాట్లాడుతూ… అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించుకోవడం కోసం జరిగే పోరాటంలో పాల్గొనాలని కోరారు. 1952లో ఏర్పడిన ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడి పోయిందన్నారు. అభివృద్ధి కోసం అందరం ఐక్యంగా పోరాడాలని పేర్కొన్నారు.
కమిటీ నాయకులు ఆర్. జనార్ధన్, మొరిగాడి చంద్రశేఖర్, చెక్క వెంకటేశ్ మాట్లాడుతూ.. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఈ నెల 22న ఆలేరులో జరిగే బహిరంగ సభ పాలకులకు కనువిప్పు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ నాయకులు కల్లెపు అడివయ్య, మంగ నరసింహులు, కేమిడి ఉప్పలయ్య, పుట్ట మల్లేశ్, ఎండి సలీం, మొరిగాడి వెంకటేశ్, పద్మశ్రీ సుదర్శన్, ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సముద్రాల సత్యం, బ్రహ్మచారి, కృష్ణ సాయి, పద్మశాలి సంఘం నాయకులు బింగి నరసింహులు, క్లాత్ అసోసియేషన్ నాయకులు బేతి కృష్ణ హరి, మొరిగాడి మహేశ్, ఎం.డీ.కుర్షిత్ పాషా పాల్గొన్నారు.