సమైక్య పాలనలో బీడుబారిన ఆలేరు నియోజకవర్గం సీఎం కేసీఆర్ దూరదృష్టితో సస్యశ్యామలంగా మారింది. రూ.1,280 కోట్లతో యాదగిరిగుట్ట ఆలయాన్ని పునర్నిర్మించి ప్రపంచపటంలో నిలిపారు. ఏండ్లుగా ఎండిపోయిన చెరువులు మిషన్ కాకతీయతో జలకళ సంతరించుకున్నాయి. నాటితో పోల్చుకుంటే నేడు వ్యవసాయ సాగు మూడింతలు పెరిగింది. కొండపోచమ్మసాగర్‌తో తుర్కపల్లి, బొమ్మలరామారం, నవాబ్‌పేట జలాశయం ప్రధాన కాల్వతో గుండాల మండలాల్లో సాగు విస్తారంగా పెరిగింది. నూతనంగా మోటకొండూర్‌ను మండలంగా మార్చాం. తండాలను గ్రామాలుగా మార్చి లంబాడీల ఆత్మగౌరవాన్ని పెంచాం. నాణ్యమైన విద్య, వైద్యాన్ని ఆలేరుకు చేరువ చేశాం. 9 ఏండ్లలో నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 3,150 కోట్ల అభివృద్ధి జరిగింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్ల పంపిణీ, మహిళా సాధికారతకు ప్రత్యేక రుణాలతో బీఆర్ఎస్ మహిళలకు చేరువయ్యింది. త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో మెడికల్ కళాశాల, ఆలేరు రెవెన్యూ డివిజన్‌గా మరో రెండు మైలురాళ్లు నియోజకవర్గానికి రానున్నాయి. ఇందంతా సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. ఎన్నికలకు మూడు నెలల ముందే అభ్యర్థుల ప్రకటన సాహసోపేత నిర్ణయం.సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ఆలేరు నియోజకవర్గ ప్రజల దీవెనలతో వచ్చే ఎన్నికల్లో గతం కంటే మెజార్టీతో గెలిచి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వివరించారు.
– యాదగిరిగుట్ట, ఆగస్టు 23
ప్రశ్న : ఆలేరుకు సాగుజలాలపై మీ స్పందన?
జవాబు : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కాల్వ ద్వారా గుండాల మండలానికి సాగుజలాలు తీసుకొచ్చాం. 2020లోనే కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి ప్రధాన కాల్వ, మన్నెవారిపల్లి, తుర్కపల్లి కాల్వల ద్వారా తుర్కపల్లి, బొమ్మలారామారం మండలాల్లోని 12,512 ఎకరాలకు సాగు జలాలు అందాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ 15వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీతో కాల్వతో తుర్కపల్లి మండలంతోపాటు రాజాపేట మండలంలో 6,467 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు అందుతాయి.
ప్రశ్న : గతంతో పోలిస్తే నియోజకవర్గంలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందా?
జవాబు : మిషన్ కాకతీయ పథకంలో మూడు విడుతల్లో 579 చెరువులు, కుంటల ఆధునీకరణ, చెక్‌డ్యామ్‌లకు రూ.230.65 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. నియోజకవర్గవ్యాప్తంగా బుక్లేరు, పెద్దకందుకూరు, బిక్కేరు, ఆలేరు పెద్దవాగులపై 23 నూతన చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతోపాటు 30 చెక్‌డ్యామ్‌లను ఆధునీకరించాం. దాంతో గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది. 2014కు ముందు కేవలం 25 నుంచి 30 వేల ఎకరాలు సాగవగా, ప్రస్తుతం 1,15,195 ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింది.
ప్రశ్న : 9 ఏండ్లలో ఆలేరు నియోజకవర్గ ఏ మేరకు అభివృద్ధి చెందింది?
జవాబు : 8 మండలాల్లో ప్రధాన రోడ్లను అద్దంలా తీర్చిదిద్దాం. గ్రామాల్లో అంతర్గత రోడ్లు నిర్మించడంతో పల్లెలు అందంగా మారాయి. ఆర్అండ్బీ, ఈజీఎస్, ఎస్డీఎఫ్, పంచాయతీరాజ్, రాష్ట్ర ప్రణాళిక నిధులు రూ.279.34 కోట్లతో నూతన బీటీ రోడ్లతోపాటు బీటీ రెన్యూవల్, అంతర్గత రోడ్డు, సీసీ రోడ్లు పూర్తయ్యాయి. రూ.76.33 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు, అశురఖానాలు, నూతన పంచాయతీ భనవనాలు, పాఠశాల అదనపు గదులు, విద్యుత్ సబ్స్టేషన్లు, స్త్రీ శక్తి భవనాలు, పశువైద్యశాలలతోపాటు వివిధ పక్కా భనవాలు పూర్తయ్యాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రూ.21.01కోట్లతో, ఆలేరు మున్సిపాలిటీలో రూ. 26.32 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. \
ప్రశ్న : విద్య, వైద్యం..?
జవాబు : యాదగిరిగుట్ట పట్టణానికి నూతనంగా మెడికల్ వైద్య కళాశాల మంజూరైంది. త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. 13 పల్లె దవాఖానల పక్కా భవనాలకు రూ.2.60 కోట్లు మంజూరవగా పనులు సాగుతున్నాయి. ఆలేరు, మోటకొండూర్, చీకటిమామిడిలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాం. యాదగిరిగుట్టలో పాలిటెక్నిక్ కళాశాల, ఇంటర్మీడియట్ కళాశాల, ఆలేరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైతం అందుబాటులోకి తీసుకురావడంతో ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. మన ఊరు మన బడి పథకం కింద నియోజకవర్గంలో 106 ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణకు రూ.11.71 కోట్లు మంజూరవగా పనులు పూర్తిచేశాం.
ప్రశ్న : చారిత్రక యాదగిరిగుట్ట పునర్నిర్మాణంపై?
జవాబు : గత ప్రభుత్వాల హాయాంలో యాదగిరిగుట్ట దేవస్థానానికి ఒక్క ఇటుకను సైతం మార్చలేదు. వెయ్యేండ్లు గుర్తిండిపోయేలా యాదగిరిగుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్ పునర్నిర్మించారు. రూ.1,280 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతి పెద్ద దేవాలయం యాదగిరిగుట్ట. ఆలయ పునర్నిర్మాణం నా హయాంలో జరుగడం పూర్వజన్మ సుకృతం.
ప్రశ్న : ఆలేరులో ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి?
జవాబు : ప్రతిపక్ష నాయకులు డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారు. వారిని పట్టించుకోబోం. 35 ఏండ్ల రాజకీయ చరిత్రలో నిత్యం ప్రజలతోనే మమేకమవుతున్నాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా నా భర్త, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి బాధితులకు అండగా నిలుస్తున్నాం.
ప్రశ్న : వచ్చే ఎన్నికల్లో మీ ఎజెండా?
జవాబు : 2018లో ఇచ్చిన హామీల్లో 85 శాతం పూర్తి చేశాం. మరో 15 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి. నాణ్యమైన విద్య యువతకు చేరువ కావడంతో విద్యావంతుల సంఖ్య పెరిగింది. నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ నెలకొల్పి యువతకు ఉద్యోగవకాశాలు కల్పిస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. ప్రతి గుంటకు సాగునీటి జలాలు అందించాలన్న లక్ష్యంతో ఎన్నికల్లోకి వెళ్తాం. గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆ పథకాలే తనకు భారీ మెజార్టీ తెచ్చిపెడ్తాయి.