రాజాపేట, మే 12 : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు, లారీ డ్రైవర్లు రైతుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల వ్యవసాయ అధికారి పద్మజ హెచ్చరించారు. సోమవారం మండలంలోని బొందుగుల ఐకేపీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి లారీ డ్రైవర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె దృష్టికి వచ్చింది.
దాంతో లారీ డ్రైవర్ నుంచి ఏఓ రూ.1,500 రికవరీ చేసి రైతు రాజ్యం సత్యనారాయణకు తిరిగి ఇప్పించారు. ఐకేపీ కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించే రైతులు ఎవ్వరికీ నయా పైసా ఇవ్వొద్దన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆమె వెంట ఏఈఓ అంజయ్య ఉన్నారు.