రామన్నపేట, ఆగస్టు 29 : రామన్నపేట మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఏసీబీ నల్లగొండ డీఎస్పీ జగదీశ్ చందర్ నేతృత్వంలో పుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, శానిటేషన్ ఆడిట్ అధికారుల బృందం శుక్రవారం ఆకస్మకింగా తనిఖీ చేసింది. ఉదయం 6 గంటల సమయంలో వసతి గృహానికి చేరుకోగా వాచ్ ఉమెన్ యాదమ్మ మాత్రమే వసతి గృహంలో ఉంది. దీంతో మోత్కూర్ హాస్టల్ లో ఉన్న ఇన్చార్జి వసతి గృహ సంక్షేమ అధికారి రజాలుబాయికి సమాచారం అందించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. వంద మంది విద్యార్థులకు గాను 40 మంది అడ్మిషన్లు పొందినట్లు రికార్డుల్లో నమోదు కాగా 9 మంది మాత్రమే వసతి గృహంలో ఉన్నారు. బిల్లులు మాత్రం అందరికి క్లైమ్ చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. పాలు, కూరగాయలు సప్లై చేసే వారిని సైతం పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సరిగ్గా నమోదు చేయక పోవడంతో ఇన్చార్జి ఏఎస్డబ్ల్యూఆర్ భిక్షంను పిలిచి ప్రశ్నించడంతో ఆయన కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.
విద్యార్థులకు ఉదయం అల్పహారంగా ఇచ్చే బోండాలను స్టీలు డబ్బాలో చేస్తుండటంతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ అస్తవ్యస్థంగా ఉండటంతో పాటు, బాత్రూం డోర్లు కూడా సరిగ్గా లేవన్నారు. నాసిరకం వస్తువులను వాడుతున్నారని తెలిపారు. హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఏసీపీ డీఎస్పీ జగదీశ్ చందర్ వెల్లడించారు. తనిఖీ రిపోర్టును డీజీకి పంపడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలో పుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి, మెట్రోలజి అధికారి వల్లపు శ్రీనివాస్, ఆడిటర్ సిరిక ప్రసన్నకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్, ఏసీబీ ఇన్స్పెక్టర్లు బి.కిషన్, వెంకట్రావు, సిబ్బంది రేణుక, రజిత పాల్గొన్నారు.