
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. పొలాల్లోకి సైతం వర్షం నీరు భారీగా వచ్చి చేరింది. రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల్లో కుండపోతగా కురిసిన వర్షంతో ఈ మూడు మండలాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ప్రస్తుత వర్షాలతో జిల్లాలోని 1,005 చెరువులు జలకళను సంతరించుకోగా, 131 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. వాగులు, వంకలు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బిక్కేరు వాగులో వరద ఉధృతి పెరిగింది. రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో శుభ కార్యానికి వెళ్తుండగా పంపుకుంట వాగు నీటిలో ఇద్దరు యువతులు కొట్టుకుపోయారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో రైతువేదిక భవనం నీట మునిగింది. జిల్లాలో అక్కడక్కడా పలు ఆవాసాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..
ఈ ఏడాది వానకాలం సీజన్ మొదలైన జూన్ మాసం నుంచి జిల్లాలో అడపాదడపగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు 407.3 మి.మీటర్ల సాధారణ వర్షపాతానికి మించి జిల్లా వ్యాప్తంగా 624మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 14 మండలాల్లో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గుండాల మండలంలో 62.4 మి.మీ., మోత్కూరులో 51.4మి.మీ., రాజాపేట 157.8 మి.మీ., తుర్కపల్లి 43.8 మి.మీ., ఆత్మకూరు(ఎం) 84.6 మి.మీ., భువనగిరి 38.6 మి.మీ., ఆలేరు 142 మి.మీ., యాదగిరిగుట్ట 97.4 మి.మీ., వలిగొండ 35.6 మి.మీ., బిబీనగర్ 19.6 మి.మీ., బొమ్మలరామారం 27 మి.మీ., రామన్నపేట 47 మి.మీ., పోచంపల్లి 22.4 మి.మీ., నారాయణపురం 37మి.మీ.లు, వలిగొండ 35.6 మి.మీ లుగా వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరితోపాటు కంది, పత్తి పంటలకు మేలు చేకూరుస్తుండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.