
యాదాద్రి, ఆగస్టు 23: శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రికొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివుడిని విభూతితో అలంకరణ చేశా రు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాభిషేకంలోపాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.
యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకించి, పట్టువస్ర్తాలు ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో ఆలంకరించారు. వేకువజామున ఆరాధన, సహస్త్రనామార్చన, సువర్ణపుష్పార్చన వంటి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతి రోజూ నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. శ్రావణమాసం పురస్కరించుకుని భక్తులు సత్యనారాయణ స్వామివ్రతాల్లో పాల్గొని వ్రతమాచరించారు. శ్రీసత్యనారాయణుడికి కొలుస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. కొండకింద గల పాతగోశాల వద్ద వసతిగృహంలో వ్రతాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
రూ. 9,79,088 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 1,11,114, రూ. 100 దర్శనం ద్వారా రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్యకైంకర్యాల ద్వారా రూ. 200, సుప్రభాతం ద్వారా రూ. 1,600, క్యారీబ్యాగుల ద్వారా రూ. 4,000, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 78,000, కల్యాణకట్ట ద్వారా రూ. 25,000, ప్రసాద విక్రయం ద్వారా రూ. 4,16,470, శాశ్వతపూజల ద్వారా రూ. 56,696, వాహనపూజల ద్వారా రూ. 12,100, టోల్గేట్ ద్వారా రూ. 830, అన్నదాన విరాళం ద్వారా రూ. 17,645, సవర్ణ పుష్పార్చన ద్వారా రూ. 89,060, యాదరుషి నిలయం ద్వారా రూ. 75,230, పాతగుట్ట ద్వారా రూ. 25,945, ఇతర విభాగాలు రూ. 9,993తో కలుపుకుని రూ. 9,79,088 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.