యాదాద్రి, నవంబర్1 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన జరిపారు. సుమారు రెండు గంటలపాటు పూజలు కొనసాగాయి. ప్రతి ఏకాదశి పర్వదినం రోజు యాదాద్రి క్షేత్రంలో స్వామికి లక్ష పుష్పాలతో అర్చనలు జరుపడం ఆలయ సంప్రదాయం. కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రధానార్చకులు, వేద పండితులు, అర్చక బృందం పర్యవేక్షకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పరమశివుడికి రుద్రాభిషేకం..
యాదాద్రి అనుబంధాలయమైన పర్వతవర్ధ్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో పరమశివుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్‌లో వెలిసిన బాల శివాలయంలో ప్రభాతవేళ మొదటగా గంటన్నరపాటు శివుడ్ని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడ్ని ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. యాదాద్రీశుడి నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవను అత్యంత వైభవంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని తరించారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని సామూహిక వ్రతమాచరించారు. పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామివారి నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాంటకంగా కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ.8,90,908 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
లక్ష్మీనృసింహుడి సేవలో ముఖేశ్‌కుమార్..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, రాష్ట్ర హాకీ సెక్రటరీ ముఖేశ్‌కుమార్ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.