కారేపల్లి, ఫిబ్రవరి 14 : కారేపల్లి మండల పరిధిలోని పోలంపల్లి గ్రామ పంచాయతీలో గల కోటిలింగాల జాతర మహా శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్నది. ఇల్లెందు డివిజన్లో రెండవ పెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచిన ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివచ్చి పక్కనే గల కోటిలింగాలవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం శివుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుండి భక్తులు కుటుంబ సమేతంగా తరలిరావడంతో మూడు రోజుల పాటు కోటిలింగాల ప్రాంతమంతా శివ నామస్మరణలతో మారుమ్రోగుతుంది. కోటిలింగాల వాగు తీరాన కాకతీయుల కాలంలో శివుడు స్వయంబుగా వెలిసినట్లు చరిత్ర. ఈ ఆలయ ప్రాంగణంలో 108 శివలింగాలు, నాగేంద్రుడి విగ్రహం, సాలెపురుగు వంటి ఆకృతులను దాతల సహకారంతో ప్రతిష్టించారు.
అయితే కొన్ని దశాబ్ధాల కాలంగా పోలంపల్లికి చెందిన ఆదివాసీ కుటుంబం వారు ఈ జాతరను నిర్వహిస్తూ వస్తున్నారు. నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో క్యూలైన్లు, చలువ పందిర్లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. వాగులోకి దిగలేని భక్తుల కోసం విద్యుత్ మోటార్ల ద్వారా స్నానాలు చేసే అవకాశం కల్పించారు. ఇల్లెందు- మహబూబూబాద్ ఆర్అండ్ రోడ్డు నుండి లోపలకు కిలోమీటర్ దూరం వెళ్లి కోటిలింగాల ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కారేపల్లి పోలీస్ శాఖ వారు వాహనదారులు, కాలినడకన వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
గేట్ కారేపల్లి బుగ్గవాగు సమీపంలో గల శ్రీ ఉమాసమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు స్వామివారి కల్యాణ ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ముత్యాలమ్మ, బొడ్రాయి, అంజనేయస్వామికి అభిషేకం పూజలు, వస్త్రధారణ, ఇత్యాధిక్యములతో ఉత్సవాలు ప్రారంభమౌతాయి. అదే రోజు రాత్రి 8 గంటలకు స్వామివారి కల్యాణంను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. మరుసటి రోజు ఆంజనేయస్వామికి ఆకుపూజ, సాయంత్రం 6 గంటలకు పురవీధి సేవలతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పర్సా పట్టాభిరామారావు, కార్యనిర్వాహహణాధికారి వేణుగోపాలచార్యులు తెలిపారు.

రేపటి నుండి కోటిలింగాల జాతర