Punjab Woman : మాతృత్వానికే మచ్చ తెచ్చేలా చేసిందో మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డల్ని హత్య చేసింది. రెండు పసి ప్రాణాల్ని తీసేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని భతిందా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం.. జస్సీ కౌర్ అనే మహిళకు ఇద్దరు పిల్లలు. సుఖ్‌ప్రీత్ కౌర్ (8) అనే కూతురు, ఫతేవీర్ (6) అనే కొడుకు ఉన్నారు. అయితే, జస్సీ కౌర్‌కు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. వారి బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించిన జస్సీ.. వారి అడ్డు తొలగించుకోవాలని చూసింది.
ఈ బంధం మత్తులో కన్నబిడ్డలపై మమకారాన్ని మర్చిపోయింది. పసి పిల్లలు అని కూడా చూడకుండా హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఒక పథకం రచించింది. ఎవరికీ తనపై అనుమానం రాకుండా వారిని చంపాలని చూసింది. రెండు వారాల క్రితం కుమార్తె సుఖ్‌ప్రీత్ కౌర్‌కు ఆహారంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. పాపం ఇది తెలియని ఎనిమిదేళ్ల ఆ చిన్నారి.. తన తల్లి ఇచ్చిన ఆహారం తిని చనిపోయింది. ఆ పాపది హత్య కాదని చుట్టుపక్కల వారిని, బంధువుల్ని ఏదోలా నమ్మించింది. 15 రోజుల క్రితం ఆ చిన్నారి అనుమానాస్పదంగా మరణించినప్పటికీ కన్న తల్లే సహజ మరణం, అనారోగ్యం అని చెబుతుండటంతో అప్పటికి పెద్దగా పట్టించుకోలేదు. అయితే, రెండు వారాల తర్వాత శుక్రవారం కూడా ఆమెకు మిగిలి ఉన్న ఆరేళ్ల కొడుకు ఫతేవీర్ కౌర్‌కు కూడా ఇలాగే ఎలుకల మందు కలిపిన ఆహారం తినిపించింది.
దీంతో శనివారం ఆ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కానీ, ఈసారి అందరికీ అనుమానం వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు చిన్నారుల మరణాలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు జస్సీ కౌర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తను చేసిన నేరాన్ని ఒప్పుకొంది. వివాహేతర సంబంధం కారణంగా పిల్లలకు ఎలుకల మందు కలిపి ఇచ్చి, హత్య చేసినట్లు అంగీకరించింది. మరోవైపు ఈమెకు సహకరించిన ఆమె సోదరి మోటో కౌర్‌తోపాటు, లాఖీ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరి సహకారంతోనే జస్సీ కౌర్ పిల్లలను హత్య చేసినట్లు తేలింది. దీంతో ప్రస్తుతం నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.