యాదాద్రి, అక్టోబర్18 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. కొండపైన క్యూ కాంప్లెక్స్‌లో గల బాలశివాలయంలో శివుడికి రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభాతవేళలో గంటన్నరపాటు శివుడ్నికొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పం చామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరించారు. వేకువజామున సుప్రభాతం అనంతరం నిత్యారాధనలు సంప్రదాయరీతిలో జరిపారు. బాలాలయంలో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా చేపట్టారు. కొండకింద గోశాల వద్ద గల వ్రత మండపంలో భక్తులు సత్యనారాయణ వ్రతమాచరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే క్యూ కట్టారు.
స్వామివారిని దర్శించుకున్న టీఎస్పీఎస్సీ సభ్యులు
లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
హుండీల ద్వారా రూ.80లక్షల ఆదాయం..
స్వామి వారి హుండీలకు 25రోజుల్లో రూ.80 లక్షల పైచిలుకు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. సోమవారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో హుండీలను లెక్కించగా రూ.80,85,676 నగదు, 35 గ్రాముల మిశ్రమ బంగారం, 3.2 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు వివరించారు.