మోత్కూరు, ఆగస్టు 21 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకంలో సాంకేతిక సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడు విడుతల్లో మాఫీ చేసినా చాలా మంది రైతులకు రాలేదు. రుణమాఫీ ఎవరికి జరిగిందో, ఎవరికి జరుగలేదో తెలియని పరిస్థితి నెలకొంది. బ్యాంకు అధికారులు విడుదల చేసిన జాబితాలో మాఫీ వచ్చిన రైతుల పేర్లు మాత్రమే ఉన్నాయి.
రుణాలు తీసుకున్న రైతుల పేర్లు జాబితాలో లేవు. ఈ రుణమాఫీ మొదటి నుంచి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. తమ పేరు రుణమాఫీలో ఎందుకు రాలేదని అడిగితే వ్యవసాయ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లేదు. ఆధార్ అప్డేట్, రేషన్ కార్డులో లబ్ధిదారుల పేరు లేదని చాలామంది రైతులకు రుణమాఫీ అంద లేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి రైతుల నుంచి ఏఈఓ, ఏఓ కార్యాలయాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
కానీ ఇప్పటివరకు పరిష్కారం జరుగలేదని రైతులు వాపోతున్నారు. మోత్కూరు రైతు సేవా సహకార సంఘంలో 876 మంది రైతులు రూ.4,49,97,096 పంట రుణాలు పొందారు. ఇప్పటి వరకు 350 మందికి మాత్రమే రూ.1.89 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా సంఘం ద్వారా రుణాలు తీసుకున్న 526 మందికి రుణమాఫీ జరుగాల్సి ఉన్నది.
అరకొర మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు
సీఎం రేవంత్‌రెడ్డి ప్రగల్బాలు పలికి రైతు రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పి ఇప్పుడు కొంత మందికే చేస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీకి 31వేల కోట్లు కేటాయించగా మూడు విడుతల్లో 17వేల కోట్లను మాత్రమే ఇచ్చారు. సగం మంది రైతులకు కూడా మాఫీ చేయకుండా చేతులు దులుపుకున్నారు. మిగతా 14వేల కోట్లను రైతు రుణమాఫీకి వినియోగించకుండా తమ జేబుల్లోకి వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు.
– నల్లమాసు రమేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
మూడు విడుతల్లోనూ మాఫీ కాలేదు
మోత్కూరు రైతు సహకార సంఘంలో గతేడాది నవంబర్24న లక్ష రుణం తీసుకున్నా. రుణమాఫీ మొదటి విడుతలోనే మాకు మాఫీ కావాల్సి ఉండే. కానీ రెండు, మూడో విడుతలో కూడా కాలేదు. వ్యవసాయ, బ్యాంకు అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగినా ఫలితం లేకపోయింది.
-సామ సునీత, రైతు, బుజిలాపురం, మోత్కూరు
జాబితాలో నా పేరే లేదు
నేను మోత్కూరు డీసీసీబీలో లక్షా 5 వేలు పంట రుణం తీసుకున్న. ప్రతి ఆరు నెలలకు తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించిన. ఇప్పుడు ప్రభుత్వం మూడు సార్లు చేసిన రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. పీఏసీఎస్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఏం చెప్పడం లేదు. బ్యాంకుకు పోతే మరో జాబితాలో వస్తది ఆగమన్నారు. తిరిగి తిరిగి వేసారినా ఫలితం లేదు. ఏఓకు ఫిర్యాదు చేయమంటే దరఖాస్తు ఇచ్చిన.
-అంబటి చిన్న నర్సయ్య, రైతు, కొండగడప, మోత్కూరు
ఇప్పుడే మోసం చేయవట్టిరి
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే లెక్కలకు ఆచరణలో జరిగే దానికి పొంతన లేదు. 2లక్షల లోపు రుణాలు పొందిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు అమలు చేయడం లేదు. నేను 82వేల పంట రుణం తీసుకుంటే మాఫీ కాలేదు. ఎవరికి రుణమాఫీ జరిగిందో అర్థం కావడంలేదు. నాలాంటి పేద రైతులకు కాకుండా ఇంకొకరికి రుణ మాఫీ చేస్తే ప్రయోజనం ఏంటి? పేరుకు మాత్రం 45 వేల కోట్లు మాఫీ చేస్తున్నమని చెప్పిండ్రు.
-పైళ్ల సతీశ్, రైతు, పనకబండ, మోత్కూరు