భువనగిరి అర్బన్, నవంబర్ 1 : జననాట్య మండలి కళాకారుడు, తెలంగాణ ఉద్యమ కార్యకర్త, గేయ రచయిత, జంగ్ పాటల క్యాసెట్‌తో రాష్ట్రంలోనే ఉత్తమ కళాకారుడిగా గుర్తింపు పొందిన జంగ్ ప్రహ్లాద్ సోమవారం మృతి చెందారు. గతనెల 27న ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో గాయపడడంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేర్పించారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తమ చికిత్స అందించినా.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. భువనగిరి మండలం హన్మాపురం ఆయన సొంత గ్రామం కాగా.. 30 సంవత్సరాలుగా జగద్గిరిగుట్టలో స్థిరపడ్డాడు. ఆయనకు ముగ్గురు సంతానం. మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్నతనం నుంచే గాయకుడిగా..
ఆయన పూర్తిపేరు సాదునేని ప్రహ్లాద్. భువనగిరి మండలం హన్మాపురం గ్రామానికి చెందిన సాదునేని ధర్మయ్య ఏడవకుమారుడు ప్రహ్లాద్. ధర్మయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి, సుద్దాల హన్మంతుతో కలిసి పాటలు పాడేవాడు. పాటలు పాడే కళ తండ్రి నుంచే ప్రహ్లాద్‌కు అబ్బింది. పాఠశాల స్థాయిలోనే జానపద గేయాలు పాడేవాడు. 1984లో హైదరాబాద్‌లోని బాబా జగ్జీవన్‌రామ్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో, ఆ తర్వాత కూడా ఆర్కెస్ట్రా, స్టేజీలపై నిర్వహించే కార్యక్రమాల్లో పాటలు పాడేవాడు.
క్యాసెట్ పేరే ఇంటిపేరుగా..
సాదునేని ప్రహ్లాద్ జంగ్ పేరుతో పాటల క్యాసెట్ విడుదల చేశాడు. అందులోని పాటలు ప్రజాదరణ పొందడంతో ఆ క్యాసెట్ పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. జంగ్ క్యాసెట్లోని పాటను లక్ష వేదికల మీద పాడడంతో ఆయనకు గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఆయనను జంగ్ ప్రహ్లాద్‌గా పిలవడం మొదలు పెట్టారు.
సీఎం కేసీఆర్‌తో పరిచయం..
హైదరాబాద్‌కు వెల్లిన తర్వాత జగద్గిరిగుట్టలో నివాసముండేవాడు. ఈ క్రమంలో 1999లో కూకట్‌పల్లిలో మాజీ మంత్రి కుమారుడు మాధవరపు సుందర్శన్రావు ప్రహ్లాద్‌కు స్నేహితుడు. ఆయన సీఎం కేసీఆర్‌తో ప్రహ్లాద్‌కు పరిచయం చేయించారు. 1999 నుంచి 2003 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పాటలు పాడుతూ ధూందాం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 2003లో కుటుంబ సమస్యలతో ఉద్యమం నుంచి దూరంగా ఉన్నాడు. ఉద్యమ సమయంలో రసమయి బాలకిషన్ సమకాలికుడిగా కలిసి పనిచేశాడు.