మోటకొండూర్, నవంబర్ 1: ప్రభుత్వ చేయూత, అధికారుల సహకారం, ప్రజాప్రతినిధుల అంకితభావం, ప్రజలు భాగస్వాములైతే ఏ గ్రామమైనా అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తుంది. ఇదే తరహాలో మండలంలోని వర్టూర్ గ్రామం నిలించింది. పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రగతి పనులతో పల్లె అభివృద్ధి చెందింది. పల్లె ప్రగతిలో భాగంగా మంజూరైన నిధులతో సీసీ రోడ్లు, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లె పకృతి వనం పనులు పూర్తయ్యి గ్రామం రూపురేఖలే మారిపోయాయి.
గ్రామంలో చేసిన అభివృద్ధి..
1326 మంది జనాభా, 350 ఇండ్లు, 1084 ఓటర్లు కలిగిన వర్టూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకుపోతున్నది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో సర్పంచ్ సత్తెమ్మ అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు. 30 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా మండల నుంచి ఉత్తమ గ్రామపంచాయతీగా ఎన్నికై నాటి కలెక్టర్ అనితారామచంద్రన్ చేతుల మీదుగా సర్పంచ్ అవార్డును అందుకున్నారు. గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం చేశారు. దళితవాడల్లోని ప్రతి వీధిలో సీసీ రోడ్లను వేయించారు. దాతల సహకారంతో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా నీడలో ఉంచారు. ప్రతి ఇంటికీ తడి, పొడిచెత్త బుట్టలను పంపిణీ చేసి పారిశుధ్యానికి పెద్దపీట వేశారు.
ప్రగతి వైపు అడుగులు..
అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామం అభివృద్ధివైపు అడుగులు వేసింది. రూ.4 లక్షలతో ఎల్ఈడీ లైట్లు, రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ 2.50 లక్షలతో డంపింగ్‌యార్డు, రూ.8లక్షలతో వైకుంఠధామం, రూ.3లక్షలతో ప్రకృతివనం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇంటింటికీ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తూ గ్రామ స్వచ్ఛతకు పాటుపడుతున్నారు. పల్లె పకృతి వనంలో తీరొక్క మొక్కలు నాటి సంరక్షిస్తుడడంతో హరితవనాన్ని తలపిస్తున్నది. గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా 600 మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మిషన్ భగీరథలో భాగంగా చుట్టుపక్కల 14 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు గ్రామంలో 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును నిర్మించారు.
గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దారు
పల్లె ప్రగతిలో గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు మెరుగ్గా జరుగుతున్నాయి. నిత్యం గ్రామాన్ని పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నాం. హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామంలో పచ్చదనం సంతరించుకున్నది. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సర్పంచ్, పాలకవర్గాన్ని కోరుతున్నాం.
-వీరస్వామి, ఎంపీడీఓ, మోటకొండూర్
పల్లె ప్రగతితోనే అభివృద్ధి
సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితోనే గ్రామం అభివృద్ధి చెందింది. పల్లె ప్రగతిలో మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించుకున్నాం. ఈ నిధులతో అన్ని రంగాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం.
-సూదగాని సత్తెమ్మ, సర్పంచ్