పగటి వేళల్లో నల్లని కృష్ణ శిలా సౌందర్యం.. రాత్రి వేళ పసిడి కాంతులతో మెరిసిపోయేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నది. మరే ఆలయంలో లేనివిధంగా వివిధ కళాకృతులతో అష్టభుజ మండప ప్రాకారాలు.. కాకతీయ కళారూపాలు.. యాలీ స్తూపాలు.. దేవతామూర్తులు.. అష్టలక్ష్మీ రూపాలతో సాలహారాలు.. వైష్ణవ తత్వాన్ని విశ్వమంతా చాటిన ఆళ్వారుల విగ్రహాలు. భక్తాగ్రేసరుల ప్రతిమలు.. ప్రహ్లాద చరితం.. ఉప ఆలయాలతో భక్త జనులను మైమరిపించేటట్లుగా యాదాద్రీశుడి సన్నిధి ఆధ్యాత్మిక నిలయంగా నిలుస్తోంది. ఇదే క్రమంలో సాధారణ భక్తుల నుంచి వీఐపీల వరకు స్వామి దర్శనం కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ‘యాడా’ చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ గత జూన్ 21న క్షేత్రాన్ని సందర్శించి వెళ్లిన తర్వాత పనులు జోరందుకున్నాయి. సీఎం సూచనలకు అనుగుణంగా పనులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తుండగా.. ఆలయ పునః ప్రారంభం, మహా సుదర్శనయాగం నిర్వహణ తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నది. సీఎం చేసే ప్రకటన కోసం భక్తజనం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నది.
మౌలిక సదుపాయాల కల్పన..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే వీఐపీల కోసం రెండు లిప్టులు సిద్ధమయ్యాయి. అతిథి గృహం నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకునేలా లిప్టులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రధానాలయం వాయువ్యదిశలో లిప్టు రూంను ప్రత్యేకంగా నిర్మించారు. 20 ఫీట్ల వెడల్పు, 20.5 ఫీట్ల పొడవుతో లిప్టు రూం ఆధ్మాత్మిక శోభతో ఆకట్టుకుంటున్నది. ఒక్కో లిప్టుతో ఏకకాలంలో 12 మంది భక్తులను స్వామివారి ప్రధానాలయంలోకి తీసుకువచ్చేలా రూపొందించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ఎస్కలేటర్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానాలయం పడమర వైపు కింది భాగంలో రూ.2.85 కోట్లతో 20X20మీటర్ల వెడల్పుతో నిర్మించిన కార్యనిర్వాహక(ఈఓ) కార్యాలయ భవనం ప్రారంభోత్సవాన్ని పూర్తి చేసుకుని వినియోగంలోకి సైతం వచ్చింది. రూ.3.0కోట్లతో 20మీటర్ల వెడల్పు, 20మీటర్ల పొడవుతో ఈఓ కార్యాలయం పక్కనే అతిథి గృహాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. రెండు ఫ్లోర్లతో నిర్మించిన ఈ భవనంలో మొదటి ఫ్లోర్లో రెండు సమావేశ మందిరాలు, ఒక ప్రత్యేక గదిని నిర్మించగా.. రెండో ఫ్లోర్లో మూడు ప్రత్యేక గదులను, ఒక పెద్ద హాల్‌ను నిర్మించారు. స్వామి దర్శనం కోసం వచ్చే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి ప్రముఖులు బసచేసేందుకు ప్రధానాలయానికి ఉత్తరాన 13 ఎకరాల గుట్టపై రూ.104 కోట్ల వ్యయంతో ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. ఇతర వీఐపీల బసకు నిర్మిస్తున్న 14 విల్లాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
సీఎం పర్యటన నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు…
సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంటెలిజిన్స్ బృందాలు ఆలయాన్ని సందర్శించి భద్రతా చర్యలను పర్యవేక్షించాయి. ప్రధానాలయం నుంచి బాలాలయంలోకి వచ్చే మార్గంలో గుంతలను పూడ్చడంతోపాటు మొక్కలు నాటే పనులను ముమ్మరం చేశారు. రింగ్ రోడ్డు డివైడర్ మధ్యలో మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో క్యూలైన్లు, గిరి ప్రదక్షిణ రోడ్డు, శివాలయం ప్రహరీ విషయాల్లో సీఎం కేసీఆర్ సూచనలకనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించిన అనంతరం చిన జీయర్ స్వామితో కలిసి మరోసారి యాదాద్రిని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా పర్యటనలో శ్రీసుదర్శన మహాయాగం నిర్వహణ కోసం స్థలాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తున్నది. స్వామి దర్శనం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న భక్తజనం ముహూర్తంపై సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి చూపుతున్నది.
అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ..
నల్లటి కృష్ణ శిలలతో సంప్రదాయ హంగులతో అద్భుత దివ్యక్షేత్రంగా నారసింహుడి ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్నది. రూ.1200కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ప్రారంభించిన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే రూ.850 కోట్ల వరకు వెచ్చించారు. ప్రధానాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సకల హంగులతో చూడముచ్చటగా ముఖ మండపాన్ని తీర్చిదిద్దారు. ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో సాలహారాల్లో విగ్రహాల బిగింపు ప్రక్రియ చాలావరకు పూర్తయ్యింది. అద్దాల మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. మూడంతస్తుల్లో క్యూకాంప్లెక్స్ క్యూలైన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రధానాలయంలో అధునాతన క్యూలైన్ల బిగింపు ప్రక్రియ పూర్తయ్యింది. మాఢవీధుల్లో బంగారు వర్ణపు క్యూలైన్లు ప్రధానాలయానికే కొత్త శోభను తీసుకొస్తున్నాయి. రథశాల ముందు ప్రహరీ అంచున ఏర్పాటు చేసిన గార్డెనింగ్ విశేషంగా ఆకర్షిస్తున్నది. క్యూ కాంప్లెక్స్ పక్కనే పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించిన విష్ణు పుష్కరిణి అందంగా ముస్తాబైంది. గతంలో 500 గజాల్లోనే శివాలయం ఉండగా.. ప్రస్తుతం ఎకరం స్థలంలో విస్తరించిన శివాలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి మండపం, మరకత మండపం, రామాలయం, ఆలయం చుట్టూ ప్రాకారాలను నిర్మించారు. నిత్యకల్యాణ మండపంలో 500 మంది భక్తులు కూర్చుని శ్రీవారి కల్యాణాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేయగా.. బ్రహ్మోత్సవాలను 10వేల మంది వీక్షించేలా ప్రాంగణాలను నిర్మించారు. లిఫ్ట్, రథశాలలకు సైతం ఆధ్యాత్మిక సొబగులు అద్దుతున్నారు.
16వ సారి పర్యటిస్తున్న సీఎం కేసీఆర్…
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి హోదాలో 2014 అక్టోబర్ 17 శుక్రవారం రోజున తొలిసారిగా యాదాద్రిలో అడుగు పెట్టారు. యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తామని అదేరోజు ప్రకటన చేయగా.. అప్పటి నుంచే యాదాద్రికి మహర్దశ పట్టుకుంది. ఆ తర్వాత 2014 డిసెంబర్ 17, 2015 ఫిబ్రవరి 25, మార్చి 5న శ్రీవారి కల్యణోత్సవంలో సతీసమేతంగా పాల్గొన్నారు. ఐదోసారి మే 30న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. జూలై 5న అప్పటి రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 2016 అక్టోబర్ 19న ఏడోసారి పనులను పర్యవేక్షించారు. 2017 నవంబర్ 23న ఆలయ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. 2017 అక్టోబర్ 24న యాదాద్రిని సందర్శించిన సీఎం.. సుదీర్ఘ విరామం అనంతరం 2019 ఫిబ్రవరి 3న పదోసారి యాదాద్రికి విచ్చేసి పనులపై ఆరా తీశారు. అదే ఏడాది అగస్టు 17న 11వ సారి, డిసెంబర్ 17న 12వ సారి పర్యటించి పలు సూచనలు చేశారు. దాంతో కొవిడ్ పరిస్థితుల్లోనూ ఆలయ పునర్నిర్మాణ పనులు నిర్విరామంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్ 13న యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ పనుల పురోగతిపై కీలక సూచనలు చేశారు. 2021 మార్చి 5న 14వ సారి, 2021 జూన్ 21న 15వ సారి పర్యటించి పనుల వేగవంతానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ 16వ సారి యాదాద్రికి వస్తున్నారు. ప్రధానాలయం పూర్తికావడం.. ఒకటీ, రెండు నెలల్లో స్తంభోద్భవుడి దర్శనం ఉంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ యాదాద్రికి వస్తుండడంతో ఈసారి పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
సకల వసతుల యాదాద్రి…
యాదాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు సకల వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు వైటీడీఏ చర్యలు చేపట్టింది. టెంపుల్ సిటీ కోసం సేకరించిన 800 ఎకరాల్లో ఇప్పటికే 250 ఎకరాల్లో రకరకాల మొక్కలతోపాటు గార్డెన్లు, ఫౌంటెయిన్లు, విశాలమైన రోడ్లను అభివృద్ధి చేశారు. మరో 250 ఎకరాల్లో 580 వరకు డోనర్ కాటేజీలను నిర్మించనున్నారు. రాబోవు రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనుండగా.. 500 బస్సుల రాకపోకలకు అనుగుణంగా బస్ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. గండి చెరువు సమీపంలో దీక్షాపరుల మండపం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట నిర్మాణాలు పూర్తవ్వగా.. బస్బే వంటి నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఉచిత అన్న ప్రసాద భవనం, సత్యనారాయణ స్వామి వ్రత మండపం పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రింగు రోడ్డు, కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ రోడ్డు, కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం పనులు తుది దశకు చేరుకున్నాయి. లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించిన యంత్రాల బిగింపు ప్రక్రియ చెన్నై, పుణే, హర్యానా, ఇండోర్, ముంబైకి చెందిన నిపుణుల ఆధ్వర్యంలో పూర్తికాగా.. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.