AIVA : వెలమల జాతిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (AIVA) తీవ్రంగా ఖండించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనగా ఆదివారం హిమాయత్ నగర్లోని ఐవా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల వెలమ సంఘాల ప్రతినిధులు వెలమ న్యాయవాదులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెలమమ జాతిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను అందరూ ఖండించారు.
ఇటీవల మిర్యాలగూడ సభలో వెలమ జాతిపై అక్రోశంతో, విచక్షణ రహితంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును సంఘం తీవ్రంగా ఖండించింది. గతంలో కూడా పలుమార్లు వెలమ జాతిని అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని సభ అభిప్రాయపడింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తం గా ఉన్న వెలమ సంఘాల ప్రతినిధులు, ప్రముఖ వెలమ న్యాయవాదులు, కుల పెద్దలు మరియు వందలాది వెలమ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెలమ శాసన సభ్యులు (MLAs), శాసన మండలి సభ్యులు (MLCs) తక్షణమే స్పందించాలని, రేవంత్ రెడ్డి చేత వెలమ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారు తమ పదవులకు, జాతి ఆత్మగౌరవానికి ఏది ముఖ్యమో తేల్చుకోవాలని ఐవా ప్రతినిధులు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గం గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నందున, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి గ్రామ, మండల జిల్లా స్థాయిలో వెలమల ఆత్మగౌరవ నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. ‘రేవంత్ రెడ్డి వెలమ జాతికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజకీయ ప్రసంగాల్లో కులాలను దూషించే సంస్కృతికి స్వస్తి పలకాలి. ప్రభుత్వం వెలమల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను మానుకోవాల’ని ఐవా ప్రతినిధులు డిమాండ్ చేశారు. వెలమ జాతి ఐక్యతను చాటుతూ, భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా జాతి ప్రయోజనాల కోసం పోరాడుతామని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ప్రకటించింది.