Mummadi Rajasimha : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజసింహ ఇస్రో(ISRO) శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థిగా అందరి ప్రశంసలు అందుకున్న రాజసింహ.. బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే దేశంలోనే అత్యున్నత సంస్థలో ఉద్యోగం సాధించారు. దీంతో అన్ని వర్గాల నుంచి రాజసింహకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది.
ప్రభుత్వ ఉపాధ్యాయులు రాజశేఖర్, ఉమా రాణిల కుమారుడైన రాజసింహ జగిత్యాలలో 10 వ తరగతి, వరంగల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తరవాత జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ప్రతిభ చూపించి.. తిరువనంతపురం(కేరళ)లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏరో స్పేస్ ఇంజినీరింగ్ సీటు సాధించారు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఆయన ఇస్రో సైంటిస్టుగా ఎంపికయ్యారు.