
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం ప్రాజెక్టు పనులలో భాగంగా 16వ ప్యాకే జీ కింద ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో నృసింహ(బస్వాపూర్) రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతోంది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి ఇక్కడకు కాళేశ్వరం జలాలను తరలించేలా డిజైన్ చేశారు. 50టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పట్టుదలతో మూడేండ్లలోనే పూర్తిచేయించారు. ఈనెల 22న సుముహూర్తాన గోదారమ్మ మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లోకి పరుగులు తీసింది. మల్లన్న సాగర్‌లోకి గోదావరి జలాల ను మళ్లించడం ద్వారా యాదాద్రి భువనగిరి ప్రజానీకం స్వ ప్నాన్ని సాకారం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరికొద్ది రోజుల్లోనే మల్లన్న సాగర్ నిండితే దిగువకు నీటిని విడుదల చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సెప్టెంబరు మొదటివారంలో బస్వాపూర్‌కు..
చివరి ఆయకట్టుకూ సాగు నీరందించి కరువును తరిమేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాలోని రైతుల కడగండ్లను తీర్చేందుకు కరువు నేలపై కాళేశ్వరం జలాలను పారించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. గతేడాది జూన్‌లో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి కాళేశ్వరం తొలిఫలాలను జిల్లాలో ఆలేరు నియోజకవర్గానికి అందించారు. ప్రస్తుతం తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. అలాగే దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలంలో గోదావరి జలాలు పారుతున్నాయి. ఎవుసానికి జీవం పోసిన గోదావరి జలాలతో ఈ మూడు మండలాల రైతు కుటుంబాలు సంతోషంతో గడుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నృసింహ రిజర్వాయర్‌కు కాళేశ్వరం జలాలను అందించాలని సంకల్పించి ఈ ప్రాంత ప్రజల కలను సాకారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత రిజర్వాయర్‌లో 1.5 టీఎంసీల నీటిని నింపేదిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాల్వ లైనింగ్ స్ట్రక్చర్లు, బ్రిడ్జీలు, సొరంగం, తూం నిర్మాణం తదితర పనులన్నీ పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. కొడకండ్ల నుంచి గ్రావిటీ ద్వారా నీటిని జగదేవ్‌పూర్ మీదుగా నృసింహ రిజర్వాయర్‌లోకి తరలించే దిశగా నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పరిహారం చెల్లింపులు పూర్తి
బస్వాపూర్ జలాశయ నిర్మాణానికి మొత్తం 4,238 ఎకరాలు అవసరం కాగా..ఇప్పటివరకు 1,723 ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. ఇందుకుగాను రైతులకు రూ.384కోట్ల మేర చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా రైతుల నుంచి 2,515 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ నడుస్తోంది. అయితే 1.5టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నేపథ్యంలో భూసేకరణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిహారం చెల్లింపుల్లోనూ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. దీని పరిధిలో భూములు కోల్పోతున్న తిమ్మాపూర్, జంగం పల్లి గ్రామాల పరిధిలోని 242 ఎకరాలకు రూ.78కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. బస్వాపూర్ రిజర్వాయర్ జలాశయ నిర్మాణ పనులు ఇప్పటివరకు 60 శాతం పూర్తవ్వగా.. ఇంకా తిమ్మాపూర్ పరిధిలో 1,200 ఎకరాలను, జంగంపల్లి పరిధిలో 500 ఎకరాలను సేకరించాల్సి ఉంది. నృసింహ రిజర్వాయర్‌లోకి ప్రయోగాత్మకంగా 1.5టీఎంసీల సామర్థ్యం మేర నీటిని నింపనుండగా.. తిమ్మాపూర్ గ్రామం ముంపును దృష్టిలో పెట్టుకుని అంతకంటే తక్కువ సామర్థ్యంలోనే నీటిని నింపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో కాళేశ్వరం తొలి ఫలాలను ఆలేరు నియోజకవర్గం పొందగా.. త్వరలోనే భువనగిరి నియోజకవర్గానికి సైతం ఆ భాగ్యం కల్గనుంది.
ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నృసింహ రిజర్వాయర్ రానున్న రోజుల్లో వరప్రదాయినిగా నిలవనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీలో 0.8టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ జలాశయాన్ని నిర్మించేలా డిజైన్ రూపొందించగా.. తెలంగాణ ప్రభుత్వం డిజైన్‌లో మార్పులు చేసింది. సామర్థ్యాన్ని 11.39టీఎంసీలకు పెంచి రూ.1,578కోట్ల అంచానా వ్యయంతో చేపట్టేలా డిజైన్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 1,218 చెరువులను నింపి 1,88,500 ఎకరాలకు సాగు నీరందించేలా రిజర్వాయర్‌కు రూపకల్పన చేశారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు, ఆత్మకూరు, భువనగిరి, తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, మోటకొండూర్, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట మండలాలతోపాటు నల్లగొండ జిల్లాలోని చిట్యాల పరిసర ప్రాంతాలు ఈ రిజర్వాయర్‌తో ప్రయోజనం పొందనున్నాయి. రిజర్వాయర్‌ను 1.5 టీఎంసీల సామర్థ్యానికి సిద్ధం చేసేందుకు ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి గడువు పెట్టుకోగా.. రెండు నెలల క్రితం జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి రిజర్వాయర్ పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఆ దిశగా పనులను వేగవంతం చేసి పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడంతోపాటు యాదాద్రి ప్రధాన ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలకు సైతం బస్వాపూర్ రిజర్వాయర్ నుంచే నీటిని పంపింగ్ చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఓటీ-2 డిస్ట్రిబ్యూటరీ కాలువ నుంచి 1.70కి.మీ.ల పైపులైన్ ద్వారా యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న గండి చెరువును నింపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.