నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఇన్చార్జిల నియామకం, వచ్చే దిగుబడులు, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తదితర అంశాలపై దృష్టి సారించింది. గత వానకాలం కొనుగోళ్లలో స్థానికంగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నది. రైస్ మిల్లర్లతోనూ ప్రత్యేకంగా చర్చలు జరిపి దిగుమతులు, ధాన్యం నిల్వలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ధాన్యం కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సీజన్లో సుమారు 27లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని, అందులో 12లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరవచ్చని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో ముందస్తుగా కేంద్రాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుండడంతో పంటల సాగు, దిగుబడులు కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందడంతో పాటు వర్షాలు కూడా అధికంగా కురుస్తుండగా చెరువులు, కుంటలు నిండాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరిసాగు గణనీయంగా పెరిగింది. వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 11.90 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో కొంచెం అటు ఇటుగా సన్న, దొడ్డురకాలు సాగుచేసినట్లు అంచనా. అయితే సాగర్ ఆయకట్టులో కొంత ఆలస్యంగా దిగుబడులు రానుండగా నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో బోర్లు, బావుల కింద సాగైన పంట దిగుబడులు మొదలయ్యాయి. ఇప్పటికే పలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకు వస్తున్నారు. వానకాంలో వచ్చే దిగుబడుల ఆధారంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు గానూ ముందుస్తుగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు విరిసాగు వివరాలను విస్తీర్ణం ఆధారంగా సేకరించారు. దీని ప్రకారం ఆయా కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి సాగైన దానిలో సగం వరకు సన్నరకాలు ఉండడంతో నేరుగా మిల్లర్లు లేదా కమీషన్ వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఇక మిగిలిన దొడ్డు రకం ధాన్యమే కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాలతో కేంద్రాల సంఖ్యను నిర్ధారిస్తున్నారు.
జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు
నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో 4.53 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నది. ఇందులో 5.43 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిని కొనుగోలు చేసేందుకు 174 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేసీ ద్వారా 87, పీఏసీఎస్‌ల ద్వారా 80, మార్కెటింగ్ శాఖ ద్వారా 7 కేంద్రాలను తెరువనున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్లో 4.69 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా 11.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగబడి వస్తుందని అంచనా. ఇందులోంచి కొనుగోలు కేంద్రాలకు 4.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చనే అంచనాతో 247 కొనుగోలు కేంద్రాలు తెరువాలని నిర్ణయించారు. 125 ఐకేపీ ద్వారా, 122 పీఏసీఎస్‌ల ద్వారా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లాలో వానకాలంలో 2.68లక్షల ఎకరాల్లో వరిసాగైంది. ఇందులోంచి 5.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుండగా.. కొనుగోలు కేంద్రాలకు 2.25 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేశారు. జిల్లాలో 120 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు.
ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాకాలం కావడం, తుఫాన్లు వ చ్చే అవకాశం ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లోకి వర్షపు నీరు చేరకుండా ఎత్తయిన ప్రదేశాల్లో ఉండే ప్రాంతాలల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల వారీగా ఇన్చార్జీలను నియమిస్తున్నా రు. గన్ని బ్యాగులు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు వంటి వాటిపై కూడా దృష్టి పెట్టారు. దీంతో పాటు ధాన్యం రవాణా కోసం ట్రాన్స్‌పోర్టు వాహనాల ఏర్పాటు, మిల్లర్లు సకాలంలో దించుకునేలా చూడడం వంటి విషయాలపై దృష్టిసారించారు. అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మిల్లర్లను భాగస్వామ్యం చేస్తూ కొనుగోళ్లు సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా వ్యవహరించాలనే నిర్ణయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లగొండ అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ధాన్యం కొనుగోళ్లపై సోమవారం సమిక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని, కేంద్రాల ఏర్పాటులోనూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మిల్లర్ల అభిప్రాయాలను తీసుకున్నారు.
ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం
వానకాలంలో కొనుగోళ్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షలు చేస్తున్నాం. ఇందులో అన్ని శాఖలను, ముఖ్యంగా రైస్‌మిల్లర్లను భాగస్వామ్యం చేస్తున్నాం. అన్ని దశల్లోనూ ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలన్నదే లక్ష్యం. రైతులు నిర్దేశించిన తేమ ప్రకారం ధాన్యం తీసుకువస్తే మద్దతు ధరకు ఢోకా ఉండదు. రైతులు కూడా కొనుగోళ్లు సజావుగా సాగేలా సహకరించాలి. వర్షాల ప్రభావం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లకు ఆదేశించాం. జిల్లా మంత్రి, కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే కొనుగోలు కేంద్రాలను తెరుస్తాం.