యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మోత్కుపల్లి, అక్కడి నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాలోని మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పార్టీలో చేరిక సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభిమానులు, దళిత నాయకులు, పార్టీ శ్రేణులు తెలంగాణ భవన్‌కు భారీగా తరలివెళ్లారు.
ప్రజా జీవితంలో సుస్థిర స్థానం..
ప్రజా జీవితంలో మోత్కుపల్లికి సుస్థిర స్థానం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మోత్కుపల్లిపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతమని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన మోత్కుపల్లి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల వాయిస్‌గా ఉన్నారన్నారు. మోత్కుపల్లి తనతో కలిసి ఎన్నోఏండ్లు పనిచేశారని గుర్తుచేశారు. మోత్కుపల్లికి రాజకీయ అనుభవం ఎంతో ఉందని, విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. మోత్కుపల్లి వెంట అభిమానంతో వచ్చిన వారందరికీ హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మోత్కుపల్లి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.