భువనగిరి కలెక్టరేట్ నవంబర్ 1 : పేదలు, బలహీన వర్గాలకు గ్రామ స్థాయిలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక కోరారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ నుంచి సోమవారం యాదాద్రి భువనగిరి, సూర్యాపేట , నల్లగొండ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలపై మాట్లాడారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సే వలు, రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటై 25 యేండ్లు పూర్తయిందన్నారు. రూ.3 లక్షల కంటే వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వారికి , మహిళలు, పిల్లల అందరికీ అసంఘటిత రంగంలో కార్మికులకు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు.
ప్రభుత్వ పథకాలు ఏవిధంగా ప్రజలకు లబ్ధ్ది జరిగేలా అమలు చేస్తున్నారో అదే విధంగా అధికార యాంత్రాంగం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్లి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ నెల 13న దేవరకొండలో నిర్వహించే న్యాయ సేవలు శిబిరానికి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సహకరించాలన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆర్టికల్ 39 ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయం అందించేందుకు అవగాహన పరిచే విధంగా మండలానికి ఇద్దరు పారాలీగల్ వలంటీర్లను నియమించనున్నట్లు తెలిపారు. సఖీ కేంద్రంగా మహిళలకు ఉచిత న్యాయం అందిస్తుందనే విషయాన్ని అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉచిత న్యాయ సహాయం పొందేందుకు వీలుగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ, గ్రామీణాభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.