కార్తిక మాసంలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు, ఆలయాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గతేడాది కార్తిక మాసంలో ఆలయ ఖజానాకు రూ.7,35,10,307 రాగా ఈ సారి రూ.14,66,38,097 సమకూరింది. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 21,480 దంపతుల భక్తుల ద్వారా రూ.1,71,84,000 ఆదాయం వచ్చింది. ఈ కార్తిక మాసంలోనే సూర్య, చంద్ర గ్రహణాలు రాగా ఆలయం మూసివేతతో ఆదాయం ఇంకొంత తగ్గినట్లు ఆలయ అధికారులు భావిస్తున్నారు.
యాదాద్రి, నవంబర్ 23 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి గతంతో పోలిస్తే డబుల్ ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కార్తిక మాసం నిత్యరాబడి రికార్డు స్థాయిలో రూ.14,66,38,097 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఇందులో సత్యనారాయణస్వామి వ్రతాలకు గాను రూ.1,71,84,000 సమకూరిందన్నారు. గతేడాది స్వామివారి ప్రధానాలయం పునర్నిర్మాణ పనుల కొనసాగింపుతోపాటు స్వామివారి నిత్య కైంకర్యాలు, దర్శనాలు బాలాలయంలోనే జరిగాయి. నిర్మాణ పనులు జరుగుతుండటం, భక్తులకు వసతులు లేకపోవడంతో కార్తిక మాసం ఆదాయం రూ.7,35,10,307 మాత్రమే సమకూరింది. ఈ ఏడాది మార్చి 28న స్వయంభూ ఆలయం పునఃప్రారంభమైంది.
భక్తులకు సకల వసతులు కల్పించారు. విస్తీర్ణమైన మాఢవీధులు, సువిశాలమైన స్వామివారి దేవాలయం కావడంతో ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కార్తిక మాసంలో భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సెలవు దినాల్లో భక్తులతో స్వామివారి ఆలయం కిటకిటలాడింది. గతేడాది సత్యనారాయణ వ్రతాల్లో 19,176 మంది పాల్గొనగా.. ఈ ఏడాది 21,480 మంది వ్రత పూజల్లో పాల్గొన్నారు. ఈ సారి కార్తిక మాసం మొదటి రోజు సూర్యగ్రహణం, కార్తిక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రావడంతో కొంతవరకు ఆదాయం తగ్గినా నిత్యాదాయంలో ఎలాంటి ప్రభావమూ చూపలేదు. సెలవు దినాల్లో భక్తులు అధికంగా పాల్గొనగా.. ఆదాయం ఆ మేరకు భారీగా సమకూరింది. ఈ నెల 13న ఆదివారం నిత్యాదాయం రూ.1,09,82,447 రాగా, 20న ఆదివారం రోజు రూ.1,16,13,977 ఆదాయం వచ్చింది. ఆలయ పునఃప్రారంభం అనంతరం నూతనాలయంలో కార్తిక మాసం ఆదాయం గతం కంటే దాదాపుగా 50 శాతం పెరగిందని ఆలయ అధికారులు వెల్లడించారు.