యాదగిరిగుట్ట, అక్టోబర్29 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈఓ భాస్కర్ రావు తెలిపారు. కొండపైన ఈఓ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్రంలో కార్తీక మాసంలో అత్యధిక వ్రతాలు జరుగుతాయని, అందుకనుగుణంగా సకల ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొండ కింద వ్రత మండపంలో 6 బ్యాచ్‌లను నిర్వహిస్తామన్నారు.
మొదటి బ్యాచ్ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, 2వ బ్యాచ్ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, 3వ బ్యాచ్ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4వ బ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు, 5వ బ్యాచ్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు, 6వ బ్యాచ్ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న 8 బ్యాచ్‌ల్లో వ్రతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం 5.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వ్రతాలు కొనసాగనున్నట్లు వెల్లడించారు. రూ. 800 రుసుముతో వ్రతానికి కావాల్సిన సామగ్రి ఆలయ అధికారులే సమకూర్చుతారని, అందుకనుగుణంగా వ్రత మండపాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వ్రత మండపం ప్రాంతంలో సీసీ రోడ్లు, పార్కింగ్ టైల్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. వాహన పార్కింగ్‌ను తీసివేస్తున్నట్లు తెలిపారు. వాలెట్ పార్కింగ్‌ను తొలిసారిగా తీసుకొస్తున్నామన్నారు. వ్రత మండపం ప్రాంతంలో స్వామివారి ప్రసాద విక్రయశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వ్రత మండప ప్రాంతంలో చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లను ఉంచనున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు ట్రై సైకిల్‌ను అందుబాటులో ఉంచామన్నారు. గత కార్తీకమాసంలో 18,203 మంది భక్తులు వ్రతాల్లో పాల్గొన్నారని, ఈ సారి ఆ సంఖ్య మరింతగా పెరిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా ప్రత్యేక వ్రతాలు ఉండవని తెలిపారు. పాతగుట్ట ఆలయంలో 5 బ్యాచ్‌లుగా వత్రాలను నిర్వహిస్తామన్నారు.
కార్తీకమాసం సందర్భంగా దీపారాధన చేసే భక్తులకు ప్రత్యేకమైన స్టాళ్లను ఏర్పాటు చేశామని ఈఓ వెల్లడించారు. కొండపైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద, ఉత్తర రాజగోపురం ఎదురుగా, కొండపైన విష్ణు పుష్కరిణి వద్ద దీపారాధన చేసుకునే వెలుసుబాటు కల్పించామన్నారు. కొండకింద లక్ష్మీ పుష్కరిణి వద్ద, సత్య నారాయణస్వామి వ్రత మండపం, స్వామివారి వైకుంఠ ద్వారంతోపాటు పాతగుట్ట ఆలయం వద్ద దీపారాధన స్టాళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
దీపావళి పర్వదినం పురస్కరించుకొని గురువారం యాదగిరి గుట్ట లక్ష్మీనరసిసంహ స్వామి ఆలయ వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. ఉదయం నిత్య కైంకర్యంలో స్వామివారి సుప్రభాత దర్శన టికెట్లను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 3.30 నుంచి 4.00 గంటల వరకు స్వామివారి సుప్రభాతం, 4.15 నుంచి 4.45 గంటల వరకు స్వామి, అమ్మవార్ల మంగళహారతులు, 4.45 నుంచి 6.30 గంటల వరకు తిరువారాధన, బాలబోగం ఆరగింపు, 6.30 నుంచి 7.30 గంటల వరకు స్వామివారికి నిజాభిషేకం, ఉదయం 7.30 గంటలకు సహస్రనామర్చన, సుదర్శన నారసింహ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 8.15 గంటల నుంచి స్వామివారి సర్వ దర్శనాలను ప్రారంభిస్తామని చెప్పారు.