నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి14(నమస్తే తెలంగాణ) : 60 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా రాష్ర్టాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించేందుకు టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సన్నద్ధ్దమైంది. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, సంఘాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు పార్టీ నేతలు, శ్రేణులు సమాయత్తమవుతున్నారు.
వేడుకల్లో భాగంగా తొలిరోజు మంగళవారం జిల్లా అంతటా వస్తు వితరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రాల వరకు పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్స్‌తో పాటు కొన్నిచోట్ల మంచి భోజనం అందించనున్నారు. ఇక వృద్ధ్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లోనూ వారి అవసరాలను బట్టి అన్నదానం, పాలు పండ్లు, ఇతర వస్తువులను పంపిణీ చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయా మండలాలు, నియోజకవర్గాల్లో ఉన్న ఆస్పత్రులు, ఆశ్రమాలను గుర్తించారు.
వీటిల్లో మంగళవారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దాంతో పాటు గిఫ్ట్ ఎ స్మైల్ కింద నిరుపేదల అవసరాలు తీర్చేలా ఏదైనా పరికరాలు అందించేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక రెండో రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున రక్తదాన శిబిరాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనేలా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా దాతలను గుర్తించే పని ముమ్మరంగా సాగుతున్నది. స్థానికంగా ఉన్న బ్లడ్ బ్యాంకుల సహకారంతో వాటి సామర్థ్ధ్యాన్ని బట్టి రక్తదాన శిబిరాల నిర్వహించనున్నారు. ఇందులో పార్టీ శ్రేణులతో పాటు వివిధ వర్గాల ప్రజలు సైతం స్వచ్ఛందంగా భాగస్వాము లయ్యేందుకు సిద్ధమవుతున్నారు. చివరి రోజు గురువారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా అంతటా సర్వమత ప్రార్థ్ధనలు చేయనున్నారు. ఆలయాలు, మసీదులు, చర్చీల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రత్యేకంగా టీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు ఇందులో పాల్గొననున్నారు.
ఇక ఇదే సందర్భంగా కేసీఆర్ అత్యంత ప్రీతిపాత్రమైన హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు చిరునామాగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగు తాగునీటితో వ్యవసాయరంగంతో పాటు పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధ్ది పథంలో దూసుకుపోతుండడంతో అందుకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్థ్ధ్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆయా జిల్లా అధ్యక్షులు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పార్టీ శ్రేణులంతా కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సేవా కార్యక్రమాలతో శుభాకాంక్షలు తెలుపాలి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహిస్తాం. మూడ్రోజుల కార్యాచరణను సిద్ధం చేశాం. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఆయా కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తారు. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, సబ్బండ వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలి. ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌కు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపాలి.
– మంత్రి జగదీశ్‌రెడ్డి