సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రద్దీకి చెక్ పెట్టాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నది. కానీ ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంలో హైదరాబాద్ మెట్రో విఫలమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అదనపు రైళ్ల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 60 కొత్త కోచ్‌లు, 10 కొత్త మూడు కోచ్‌ల ట్రైన్ సెట్లను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. కానీ ఈ బోగీలకు సాంకేతికపరమైన అంశాలతో పెద్ద చికుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశలో కొనుగోలు చేసిన రోలింగ్ స్టాక్ (రైళ్లు).. ఆటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్, ఆటోమెటిక్ ట్రైన్ ఆపరేషన్, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఈ వ్యవస్థలే రైళ్ల వేగ నియంత్రణ, భద్రత, రెండు రైళ్ల మధ్య దూరం, ఆటోమెటిక్ రాకపోకలను శాసిస్తాయి. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో 57ట్రైన్ సెట్లు అందుబాటులో ఉండగా, ప్రతి రైలులోనూ 3కోచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా మరో 10 కొత్త రైళ్లను (60 కోచ్‌లను) ఈ వ్యవస్థలో జత చేయాలని భావిస్తుండగా.. పాత రోలింగ్ స్టాక్‌తో కొత్త కోచ్‌లను అనుసంధానించడంలో సాంకేతిక ఇబ్బందులు తెరపైకి వచ్చాయి.
అదనపు కోచ్‌లు వస్తే రద్దీ తగ్గుతుందని ఆశించిన ప్రయాణికులకు ఈ సాంకేతిక అడ్డంకులు కొంత నిరాశ కలిగించేవే. పాత సిగ్నలింగ్ వ్యవస్థలో కొత్త బోగీల అనుసంధానం సులభం కాకపోవడం, దీనికి భారీ వ్యయం, సాంకేతిక మార్పులు అవసరం కావడంతో మెట్రో అధికారులకు ఇదొక పెద్ద పరీక్షగా మారింది. ప్రభుత్వ, డీఎంఆర్సీ సంయుక్తంగా ఈ అడ్డంకులను అధిగమిస్తేనే నగరానికి కొత్త మెట్రో బోగీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గుర్తించినట్లు సమాచారం.
మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోగీలపై హడావుడి ప్రకటన చేసింది గానీ, సాంకేతిక లొసగులను అధ్యయనం చేసిందా? లేదా అనే ఇప్పుడు అంతు చిక్కని అంశంగా మారింది. ఈ సాంకేతిక చికుముడిని విప్పేందుకు ఇటీవలే ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఇంజినీర్లు హైదరాబాద్‌లో పర్యటించి, మెట్రో అధికారులతో చర్చలు జరిపారు. ప్రధానంగా రెండు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతమున్న పాత సాంకేతికతకు సరిపోయేలా కొత్త రైళ్లను ప్రత్యేకంగా డిజైన్ చేయాల్సి ఉందని సూచించింది. పాత పద్ధతికి సర్దుబాటు చేయడం కంటే, ఇప్పటికే ఉన్న సిగ్నలింగ్, ట్రైన్ కంట్రోల్ వ్యవస్థ మొత్తాన్ని ఆధునికీకరించడం మరో అంశం. ఇందులో రెండో మార్గమే మెరుగైనదని, భవిష్యత్తులో మరిన్ని కొత్త కోచ్‌లను సులువుగా సమీకరించడానికి ఇది దోహదపడుతుందని డీఎంఆర్సీ ఇంజినీర్లు సూచించినట్లు తెలిసింది.