హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కేసు నిరూపణకు అవసరమైన కీలక సాక్షిని ఒకసారి విచారించిన తర్వాత అవసరమైతే మళ్లీ కోర్టుకు పిలిపించి విచారించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. సాక్ష్యం ఒకసారి నమోదు చేసినందున మళ్లీ విచారించడానికి వీల్లేదన్న నిందితుడి అభ్యంతరాన్ని తిరసరించింది. వివరాల్లోకి వెళ్తే.. ఏసీబీ నమోదు చేసిన ఓ కేసులో మొదటి సాక్షిని 2017లో విచారించారు.
ఆ సాక్షిని 2026లో మరోసారి విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించడాన్ని సవాలు చేస్తూ నాటి డిచ్పల్లి ఇన్స్పెక్టర్ డీ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జే శ్రీనివాసరావు విచారణ జరిపారు. వాదనలను పరిశీలించిన న్యాయమూర్తి.. సీఆర్పీసీలోని సెక్షన్ 311 కింద క్రిమినల్ కోర్టులకు విసృ్తత అధికారాలు ఉన్నాయని, న్యాయసమ్మతమైన తీర్పు కోసం సాక్షి కీలకంగా ఉన్న పక్షంలో కేసు ఏ దశలో ఉన్నప్పటికీ అతడిని తిరిగి విచారించే అధికారం కోర్టుకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించారు. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సాక్షి విచారణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రాసిక్యూషన్ ఎలాంటి వాయిదా కోరరాదని స్పష్టం చేస్తూ.. మొత్తం విచారణ ప్రక్రియను 4 వారాల్లోగా ముగించాలని కింది కోర్టును ఆదేశించారు.