న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీల) నియామకాలను నియంత్రించే చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా, వద్దా అనే విషయమై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం రెండు భిన్నమైన తీర్పులను వెలువరించింది. దీంతో ఈ పిటిషన్లను విస్తృత ధర్మాసనం ముందు ఉంచాలా, వద్దా అనే విషయమై ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) నిర్ణయం తీసుకుంటారు.
ఈ కేసును న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ విచారించారు. సీఈసీ, ఈసీల నియామకానికి సంబంధించిన ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని నామినేట్ చేసే కేంద్ర మంత్రిని చేర్చిన 2023 నాటి చట్టాన్ని ఈ పిటిషన్లు సవాలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని జస్టిస్ దత్తా అభిప్రాయపడగా, ఈ పిటిషన్లో లేవనెత్తిన రాజ్యాంగపరమైన ప్రశ్నలను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సిన అవసరం ఉందని జస్టిస్ శర్మ తన తీర్పులో పేర్కొన్నారు.
ఈ పిటిషన్లను మేము ఐదు రోజులకు పైగా విన్నాము. ఏకతాటిపై మాట్లాడి ఉంటే సంస్థాగత సమైక్యతకు దోహదపడి ఉండేది. దురదృష్టవశాత్తు మా అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి. పాలకులు చట్టానికి కట్టుబడి ఉంటారు. కానీ దానికి అతీతులు కారు అనేది రాజ్యాంగ వ్యవస్థ మౌలిక సూత్రం అని జస్టిస్ దత్తా తీర్పు ఇచ్చారు. జస్టిస్ శర్మ దీనితో విభేదిస్తూ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఎంపిక కమిటీ తటస్థ సభ్యుడిని చేర్చకపోవడంలో పార్లమెంట్ నిర్ణయం సరైనదేనా, కాదా అనేది విస్తృత ధర్మాసనం పరిశీలించాల్సిన విషయమని పేర్కొన్నారు.