యాదగిరిగుట్ట, నవంబర్20: పాతగుట్ట రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు, షాపులు కోల్పోయిన బాధితులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహారాన్ని పాతగుట్ట రోడ్డు బాధితులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పాతగుట్ట చౌరస్తా వద్ద బాధితులతో కలిసి ఆయన రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. నష్టపరిహారాన్ని అందజేసిన తర్వాతే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన రోడ్డు విస్తరణలో సుమా రు 138 షాపులు, ఇండ్లు కోల్పోగా వారికి నాటి సీఎం కేసీఆర్ ఇండ్లు కోల్పోయినవారికి ఫ్లాట్‌తో పాటు నష్టపరిహారం, షాపులు కోల్పోయినవారికి షాపులు, ఉపాధి కోల్పోయినవారికి కొండపై ఉద్యోగం మంజూరు చేసి, బాధితులను కడుపులో పెట్టుకుని కాపాడారని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇం దుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. పాతగుట్ట రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బాధితులతో సంప్రదించకుండా, ఎన్ని ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేపడుతున్నారో చెప్పకుండా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారని అన్నా రు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్యేకు సంపాదన మీద ఉన్న సోయి, నష్టపోతున్న బాధితులమీద లేదన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా అభివృద్ధి చేస్తే సంతోషిస్తామని, కానీ నిరుపేదల ఇండ్లు తొలగించి, వారికి ఉపాధిలేకుండా చేసి ఇబ్బందులకు గురి చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు..
రోడ్డు విస్తరణలో భాగంగా తమకు న్యాయం చేయాలని బాధితులు శాంతి యుతంగా నిరసన ప్రదర్శన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కర్రె వెంకటయ్య ఆరోపించారు. గత రాత్రి నుంచి కొంతమంది పట్టణ కాంగ్రెస్ నాయకులు బాధితులకు ఫోన్లు చేసి ధర్నాకు వెళ్లొద్దని, వెళితే పీడీ యాక్టు నమోదు చేయిం చి, జైళ్లకు పంపిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసిందన్నారు. అధికారం ఉంది కదా మేం ఏమైనా చేస్తామంటూ చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేసేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఈ సందర్భంగా పట్టణంలో సుమారు గంట పాటు ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి రాస్తారోకోను భగ్నం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, నాయకులు దేవపూజ అశోక్, పేరబోయిన సత్యనారాయణ, గడ్డం చంద్రం, కొన్యాల నర్సింహారెడ్డి, దండెబోయిన వీరేశం, ముక్యర్ల శ్రీశైలం, గ్యాదపాక క్రాంతి, పాండురాజు ఉప్పలయ్య, భక్త కన్నప్ప, గడ్డమీది రాజాలు, బుడిగె సత్తయ్య, పబ్బాల సాయి, చిరంజీవి, బర్ల శివయ్య, ఎస్కే నజీర్, కన్నా రాజు, బండ రామస్వామి, సర్ధార్, పాతగుట్ట రోడ్డు బాదితులు కోకల రవీందర్, కంసాని స్వామి, దేవేందర్, శేఖర్, కాళీ, బాలకృష్ణ, రవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
40 ఫీట్లు మాత్రమే విస్తరించాలి..
గతంలో కేవలం 30 ఫీట్లు మాత్రమే సీసీ రోడ్డు ఉండేదని, దానికి మరో 10 ఫీట్లు విస్తరించి, 40 ఫీట్లు మాత్రమే బీటీ రోడ్డును విస్తరించాలని పాతగుట్ట రోడ్డు బాధితుడు కోకల రవి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాధితులతో మాట్లాడి, వారిని ఒప్పించి విస్తరణ చేపట్టారన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా నష్టపరిహారం అందజేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీసం తమను పట్టించుకోవడం లేదన్నారు. తమతో సంప్రదించి, నష్టపరిహారం ప్రకటించి రోడ్డు విస్తరణ చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామన్నారు. తమకు న్యాయ జరిగే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదన్నారు.