భువనగిరి కలెక్టరేట్, జూన్ 11 : తెలంగాణలోని ప్రతి పల్లెలో కవులు, కళాకారులు ఉన్నారని, సాహితీ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సాహితీ దినోత్సవాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ పుస్తకాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కనపడుతున్నాయని, తెలంగాణ సంస్కృతిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కవులు, కళాకారుల పాత్ర అభినందనీయమని, భువనగిరి జిల్లాకు చెందిన సాహితీవేత్తలు తమ రచనలు, పాటల ద్వారా తెలంగాణను జాగృతం చేశారని పేర్కొన్నారు.
దాశరథి పురసార గ్రహీత, ప్రముఖ కవి, రచయిత డాక్టర్ ఆచార్య కూరెళ్ల విఠలాచార్య మాట్లాడుతూ ఈ రోజు తెలంగాణ మొత్తం కవితాగానం వినిపిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు, తెలంగాణ సాహిత్యానికి ఎంతో బలం ఉందని, నా తెలంగాణలో కవులు, రచయితలు ఎంతో మంది ఉన్నారని రొమ్ము విరుచుకొని చెప్పవచ్చన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి కవి, పండితుడు పోతన మాత్యుడి పేరు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కవులు, రచయితలకు సన్మాన పత్రాలతోపాటు రూ.1,116 నగదు పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అమరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అమరేందర్‌గౌడ్, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మందడి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగేశ్వరాచారి, వివిధ శాఖల అధికారులు, కవులు, రచయితలు సాహితీవేత్తలు పాల్గొన్నారు.