మోటకొండూర్, మే 5 : మండలంలోని కాటేపల్లి గ్రామ సమీపంలో గల ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ (పీఈఎల్)గేటు ఎదుట కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కంపనీలో జరిగిన పేలుడు నేపథ్యంలో కార్మికులు తమ భద్రతతో పాటు పలు సమస్యలకు పరిష్కారం చూపి భరోసా కల్పించిన తర్వాతనే విధులకు హాజరవుతామని తెలిపారు. ప్రాణాలకు భరోసా కల్పించాలని, కనీస వేతనం రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని భారాన్ని తగ్గించి రోజూ 8 గంటలే పని ఉండేలా చూడాలన్నారు. డ్యూటీలో ఇద్దరు కార్మికులను ఉంచాలని, ఒక డాక్టర్‌ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని కోరారు.
కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించి కంపెనీ నుంచే ప్రతి ఒక్కరిని తీసుకోవాని, మెరుగైన ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. పనిలో చేరిన వెంటనే ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని, పీడీఏ పాయింట్ ఇవ్వాలని, కార్మికులకు భోజన హాల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిన తరువాతనే విధుల్లోకి వస్తామని ధర్నా చేపట్టారు. కంపెనీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ ధర్నా వద్దకు వచ్చి కార్మికుల వినతిని స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్మికులు జి.నాగిరెడ్డి, వాకిటి నవీన్‌రెడ్డి, కాదూరి ఏలేందర్, బాల్ద సిద్దులు, నాగార్జున, ప్రవీణ్, చందు, నాగరాజు పాల్గొన్నారు.