పాలకవీడు, సెప్టెంబర్ 22: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురంలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికుడు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందడంతో సోమవారం ఉదయం ఫ్యాక్టరీ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించి ఎస్సై కోటేశ్ తెలిపిన వివరాల ప్రకారం. యూపీలోని బలియా జిల్లా, కస్ కరూర్ తాలూకా, కాకర్ ఘాట్‌కు చెందిన వినోద్ అవాక్(45), దక్క న్ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్న లేబర్ కాలనీలో ఉంటూ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో దుస్తులు ఉతుకుతున్న సమయంలో వినోద్‌కు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. అక్కడే ఉన్న తోటి కార్మికులు వినోద్‌ను వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించాన్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారన్నారు. కాగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఫ్యాక్టరీ గేటు ఎదుట మృతి చెందిన వినోద్ కుటుంబానికి పరిహారం చెల్లించాలంటూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు.
ధర్నా తీవ్ర రూపం దాల్చడంతో అక్కడికి వెళ్లి ధర్నా వద్దని, నలుగురు కార్మికులు వస్తే ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడి పరిహారం ఇప్పించే ప్రయ త్నం చేస్తానని చెప్పినా కార్మికులు వినకుండా మూకుమ్మడిగా పోలీసులపై రాళ్లతో దాడి చేశారని ఎస్సై తెలిపారు. ఈ దాడిలో పోలీసులు స్వల్పంగా గాయపడటమే కాకుం డా, ఫ్యాక్టరీలోని సెక్యూరిటీ గదికి సంబంధించిన అద్దాలు, పాలకవీడు పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పోలీసు పహారాలో ఉందన్నారు. పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి, పట్టుకునే పనిలో ఉన్నామన్నారు. ఘటనా స్థలా న్ని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం పరిశీలించారు.
దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకొంటాం
పాలకవీడు , సెప్టెంబర్ 22: దక్కన్ ఫ్యాక్టరీ ఘటనలో పోలీసులపై దాడులు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకొంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. భవానీపురంలోని దక్కన్ ఫ్యాక్టరీలో యూపీ, బీహార్ కార్మికులు చేసిన విధ్వంసాన్ని పరిశీలించారు. ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ… యూపీకి చెందిన వినోద్(48) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడన్నారు.
వినోద్ స్నేహితులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి అంబులెన్స్‌లో వినోద్ మృతదేహాన్ని యూపీకి తరలించారన్నారు. కొందరు అల్లరిమూకలు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇతర రాష్ర్టాల కార్మికులను రెచ్చగొట్టి ఫ్యాక్టరీలో ధర్నా పేరుతో అలజడి సృష్టించడానికి యత్నించగా పాలకవీడు ఎస్‌హెచ్‌వో కోటేశ్ సిబ్బందితో అడ్డుకోవడానికి యత్నించారని, దీంతో కార్మికులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడిచేశారని ఎస్పీ తెలిపారు. పోలీసులపై దాడిచేసిన వారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో వారందరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.