త్రిపురారం, జూన్ 23 : మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలని ఏపీడీ శ్రవణ్‌కుమార్ అన్నారు. సోమవారం త్రిపురారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో సంఘబంధం అధ్యక్ష, కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు ఆయన పాల్గొని మాట్లాడారు. అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు తమ చెక్ పవర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. మహిళలు స్వయంగా పొదుపు చేసుకుని తద్వారా బ్యాంకుల నుంచి అప్పులు పొంది ఆ వాటా ధనంతో మహిళా సంఘాలు అభివృద్ధి చెందాలన్నారు.
మహిళా సంఘాల ద్వారా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఆదర్శ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫాంలు కుట్టడం, సోలార్ ప్లాంట్ల నిర్వహణపై అవగాహన పెంచుకుని లాభాలను గడించడానికి కృషి చేయాలన్నారు. అప్పులు తీసుకోవడమే కాకుండా బ్యాంకులకు తిరిగి చెల్లించాలని, పాడి పరిశ్రమ, టైలరింగ్, కిరాణ షాపులు వంటి వ్యాపారాలను చేసుకుంటూ అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం అరుణ్‌కుమార్, ఏపీఎం అశోక్‌కుమార్, సీసీలు మురళీ, హేమానాయక్, దేవ్‌సింగ్, సీఆర్పీలు తిరుమల, సుమతి, మండల అధ్యక్షురాలు నాగమణి, వీవోఏలు రాణి, విజయ, ఎన్ఎస్ఏ అలివేలు, అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, వీబీకేలు పాల్గొన్నారు.