అర్వపల్లి, ఆగస్టు 23 : తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన వ్యక్తం చేశారు. జాజిరెడ్డిగూడెంలోని ఎస్సీ మాదిగ, మాల, సినిమా టాకీస్ కాలనీల్లో సంవత్సరం కాలంగా తాగునీటి సమస్య ఎదువుతుందన్నారు. పరిష్కారం కోసం అధికారులు తాత్కాలిక పనులు చేస్తున్నారు తప్ప..శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలనీ వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు.
సమస్య తీరాలంటే కొత్తగా రెండు వాటర్ ట్యాకులు నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని వీధులకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే కలెక్టర్, ఎంపీడీవో పరిష్కరించని పక్షంలో కార్యాలయాల ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలబోయిన కిరణ్, శ్రీరాములు, ఎల్లయ్య, ప్రవీణ్, సైదులు, వెంకన్న, లక్ష్మి, హేమలత, సైదమ్మ, సంధ్య పాల్గొన్నారు.