– మల్లు లక్ష్మి పిలుపు
రామగిరి, జనవరి 17 : ఈ నెల 25 నుండి 28 వరకు హైదరాబాద్ నగరంలో జరుగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల ప్రారంభ రోజు 25వ తేదీన నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. యువతీ–యువకులు దేశ భవిష్యత్‌కు బాధ్యత వహించాల్సి ఉన్నదని, వారికి సరైన మార్గదర్శనం కోసం మహిళా సంఘం వివిధ ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. విద్యపై దృష్టి పెట్టాలని, మత్తు పదార్థాలు–మద్యపానం వంటి చెడు అలవాట్లను విడనాడాలని యువతకు ఆమె పిలుపునిచ్చారు.
మహిళలపై జరుగుతున్న దాడులకు మద్యం, అశ్లీలత వంటి సామాజిక వ్యాధులే కారణమని, ప్రభుత్వాలు వీటిని నిరోధించడంలో గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో ఘోరంగా విఫలమైందని, వెంటనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె అన్నారు. తెలంగాణలో ఐద్వా జాతీయ మహాసభలు జరగడం ఇదే మొదటిసారి అని, దేశ వ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, అధ్యక్షురాలు పోలిపోయిన వరలక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు జిట్టా సరోజ, తుమ్మల పద్మ పాల్గొన్నారు.