అడవిదేవులపల్లి, జూలై 19: మండల కేం ద్రంలోని కేజీబీవీలో వాచ్‌ఉమెన్‌గా పని చేస్తున్న కేతావత్ అరుణ శనివారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మండలంలోని ఉల్సాయిపాలెం గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన అరుణ తొమ్మిదేండ్లుగా కేజీబీవీలో పని చేస్తోంది. శనివారం పాఠశాలకు వచ్చిన ఆమెను ఎందుకు ఆలస్యమైందంటూ ఎస్వో ప్రశ్నించారు. అరుణ సమాధానం ఇస్తూ పనివాళ్ల మధ్య వివాదాలు సృష్టించేలా ప్రవర్తిస్తున్నారని బదులివ్వడంతో ఎస్వో దుర్భాషలాడారు.
మనస్థాపానికి గురైన అరుణ దగ్గరలోని విద్యుత్ వైర్‌ను పట్టుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అక్కడున్న ఓ విద్యార్థిని చున్నీ లాగి అరుణ తన మెడకు చుట్టుకునే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. వెంటనే ఆమెను స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఈ సందర్భంగా బా ధితురాలు అరుణ మాట్లాడుతూ ఎస్వో వేధింపులు భరించలేకపోతున్నామని ఆరోపించారు.
ఈ విషయమై ఎస్వో నాగలక్ష్మిని వివరణ కోరగా తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని, పాఠశాల మెనూ విషయం లో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, విద్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలని చెప్పడంతో సిబ్బందిలో కొందరు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాను అనని మాటలను అన్నట్లుగా చెబుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.