సూర్యాపేట, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంతో జనం విసిగి శాపనార్థాలు పెడుతున్న తరుణంలో వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం ఎదురవుతుందో అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. మరోపక్క గ్రామాల్లో గుం పులు, గ్రూపుల పంచాయితీలతో అధిష్టానం సతమతమవుతుంది. సర్పంచ్‌గా గెలిచి ఏదో సాధించాలనే ఆలోచనతో కాకుండా ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు సెలక్ట్ చేసిన సర్పంచ్ అభ్యర్థులకు పోటీ గా రెబల్‌గా బరిలో ఉంటామంటూ గ్రామాల్లో రెండు మూడు గ్రూపుల నుంచి నామినేషన్లు వేశారు. నేటితో తొలి విడతకు బరి నుంచి విరమించుకునేందుకు గడువు ముగియనుండగా బతిమాలుతారో… బెదిరిస్తారో…డబ్బులు ఇస్తారో కానీ ఏదో ఒకటి చేసి రెబల్స్ విత్ డ్రా అయ్యేలా చూడాలంటూ పెద్ద నాయకులు వేడుకుంటున్నారని బరిలో ఉన్న అభ్యర్థి ఒకరు తెలిపారు. మూడు విడతలు కలిపి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు, 4,388 వార్డులకు ఎన్నికలు జరగనుండగా..
తొలి విడతలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలతోపాటు సూర్యాపేటలోని సూర్యాపేట, ఆత్మకూర్.ఎస్ మొత్తం ఎనిమిది మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1442 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరుగనుండగా, 1315 నామినేషన్లు సర్పంచ్, 3,646 నామినేషన్లు వార్డు మెంబర్లకు దాఖలయ్యాయంటే ఏ స్థాయిలో పోటీ ఉందో ఇట్లే అర్థం అవుతుంది. ఈ స్థాయిలో పోటీ ఉండడానికి కారణాలు వెతికితే విత్‌డ్రా చేసుకుంటే డబ్బులు వస్తాయని కొందరు, తమకు కులం, వర్గం లాంటి రకరకాల లాభాలు ఉన్నాయి… గెలుస్తామని కొందరు నామినేషన్లు వేస్తే గ్రూపుల పంచాయితీనే అతి పెద్ద రీజన్‌గా తెలుస్తుంది. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో రాజకీయంగా గ్రూపులే కారణమని తెలుస్తుంది. ఈ నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెంలో 17 పంచాయతీలకు గానూ 116 నామినేషన్లు దాఖలు కాగా 14 పంచాయతీలు ఉన్న నాగారంలో 133, 16 పంచాయతీలు ఉన్న తిరుమలగిరిలో 86 నామినేషన్లు అలాగే సూర్యాపేటలో 25 పంచాయతీలకు 184 ఇలా ఏ మండలంలో చూసినా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.
తొలి విడత జరిగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో రెబల్ అభ్యర్థులను విత్‌డ్రా చేయించేందుకు కాంగ్రెస్ నాయకులకు తలకుమించిన భారం గా మారింది. పార్టీలకు సంబంధం లేకపోయినప్పటికీ పార్టీ నుంచి బలపర్చుతూ అభ్యర్థిని నిలబెడతామని మొత్తం జాబితా అధిష్టానానికి చేరుతుందని, 80శాతం మందిని గెలిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లవుతుందనే పై నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో రెబల్ అబ్యర్థుల బెడద నుంచి బయట పడేందుకు బతిమాలుతారో… బెదిరిస్తారో…డబ్బులు ఇస్తారో మీ ఇష్టం ఏదో ఒకటి చేసి రెబల్స్ విత్ డ్రా అయ్యేలా చూడాలంటూ పెద్ద నాయకులు వేడుకుంటున్నారు. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం అవుతుండగా కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలనూ కొనసాగించకపోవడంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయరనే అనుమానాలు బలంగా ఉండగా, డబ్బులున్న బలమైన అభ్యర్థులను రంగంలో ఉంచి, మిగిలిన రెబల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో విత్‌డ్రా చేయించాలని గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో పక్క పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గెలుపు ధీమాతో ఉన్న ఆ పార్టీ అబ్యర్థులను ఓడించడం అంత ఈజీ కాదని , ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవడంతోపాటు పార్టీలో కుమ్ములాటలతో రెబల్స్ బరిలో ఉంటే ఘోర వైఫల్యం తప్పదని అధికార పార్టీ నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అర్వపల్లి, డిసెంబర్ 2: జాజిరెడ్డిగూడెం మండలంలో ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ధర్నాలు, ప్రెస్మీట్లు నిర్వహించారు. సఖ్యత కుదరకపోవడంతో పార్టీలో విభేదాలు బహిర్గం అవుతూ నే ఉన్నాయి. తాజాగా మండల పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ అభ్యర్థుల జాబితాను మండల కాంగ్రెస్ కమిటీ పేరుతో ఉన్న లెటర్ ప్యాడ్‌తో ప్రెస్‌నోట్ విడుదల చేసి వీరిని కాదని, ఎవరైనా నాయకులు, కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేస్తామని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఎమ్మెల్యే మందుల సామేల్ జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఉంటున్నాడని పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ముందస్తు సమాచారం తెలపకుండా అనధికారంగా జాజిరెడ్డిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల పేరు ప్రకటించడం ఏంటని, వీరికి ప్రకటించే అధికారం లేదని ప్రకటించిన అభ్యర్థుల జాబితా చెల్లదని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో వీరి వెనకాల ఉన్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరంచా డు. దీంతో అసమ్మతులు జిల్లా, రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే ఆదేశాలు చెల్లవని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య వివరణ ఇచ్చాడు. ఎవరికే వారే యము నా తీరే అన్నట్టు ఇప్పటికే జాజిరెడ్డిగూడెంలోని 17 పం చాయతీలకు సర్పంచ్ పోటీల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు పోటీలో ఉన్నారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.