చౌటుప్పల్, డిసెంబర్ 13 : ప్రభుత్వ ఉపాధ్యాయుడైన ఆయన.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూనే పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగస్వామ్యం కావడంతోపాటు విద్యార్థులు, ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు నడుం బిగించారు. అశోక చక్రవర్తిని ఆదర్శంగా తీసుకొని హరితహారాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న రీతిలో హరిత అశోక చక్రానికి రూపకల్పన చేశారు. వెయ్యి పాఠశాలలకు హరిత చక్రాలను పంపిణీ చేయడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రేగట్టి రాజిరెడ్డి.
వెయ్యి పాఠశాలల్లో హరితహారంపై అవగాహన
ఉపాధ్యాయుడు రేగట్టి రాజిరెడ్డి పర్యావరణ పరిరక్షణకు తన వంతు పాత్ర పోషించాలని హరితమిత్ర స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అశోక చక్రవర్తి మొక్కల పెంపకానికి అవలంబించిన పద్ధతులను ప్రజలకు చెప్పేందుకు వినూత్నంగా హరిత అశోక చక్రం పోస్టర్‌కు రూపకల్పన చేశారు. అశోకుని ధర్మ చక్రానికుండే 24 ఆకులతో 24 ప్రత్యేకాంశాలను రూపొందించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తాను పనిచేస్తున్న తాళ్లసింగారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెయ్యి పాఠశాలలకు తన సొంత డబ్బు రూ.2లక్షలా 50వేలు ఖర్చు చేసి హరిత అశోక చక్రం పోస్టర్లను పంపిణీ చేశారు. దీనికితోడు మిత్రునికో హరిత లేఖ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజిరెడ్డి.. విద్యార్థులతోపాటు తెలిసిన వారందరికీ లేఖలు రాస్తూ తోటి స్నేహితులకు రాసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు తమ స్నేహితులకు లేఖలు రాయడం ద్వారా హరితహారం ప్రాధాన్యతను వివరించారు.
సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో చైతనం
రాజిరెడ్డి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఓ పక్క పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. మరోపక్క సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. సమాజంలో అమ్మాయిల పట్ల చులకన భావం వద్దని, వారి ప్రాధాన్యతను వివరిస్తున్నారు. పీఓపీతో చేసిన వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించవద్దని, మట్టి విగ్రహాలనే వాడాలని రెండు దశాబ్దాల నుంచి అవగాహన కల్పిస్తున్నారు. ఎయిడ్స్ నిర్మూలన.. ఓటు నమోదు, వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో నిరుపేదలు, పారిశుధ్య కార్మికులకు సొంత ఖర్చుతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
మంత్రుల అభినందనలు
హరితహారానికి రాజిరెడ్డి చేస్తున్న కృషిని తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితోపాటు ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు అభినందించి సన్మానించారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి అనేక అవార్డులు వచ్చాయి. హరితమిత్ర, పుడమి జాతీయ అవార్డు, అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారం, న్యాకో జిల్లా బెస్ట్ ట్రైనర్ వంటి అవార్డులు అందుకున్నారు.
హరితహారం స్ఫూర్తిదాయకం
నేటి సమాజంలో జీవన విధానం మారడం వల్ల పర్యావరణం పెను ప్రమాదంలో పడింది. స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకడం కష్టమైంది. మానవుల విధానాల వల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంలో పడింది. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం నన్ను ఎంతో ఆకర్షించింది. హరిత ఉద్యమంలో భాగం కావాలని ఆనాడే నిశ్చయించుకున్నా. విద్యార్థులతోపాటు ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా హరిత అశోక చక్రానికి రూపకల్పన చేశా. ఇప్పటికే వెయ్యి పాఠశాలల విద్యార్థులకు హరితహారంపై అవగాహన కల్పించడంతో పాటు మిత్రునికో లేఖ ద్వారా హరితహారం ప్రాధాన్యతను వివరిస్తున్నా.
– రేగట్టి రాజిరెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తాళ్లసింగారం