సూర్యాపేట, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ):స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహ ణ ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉండగా..పలు రాజకీయ పార్టీల నేతల్లో మాత్రం అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 42శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసుపై బుధవారం హైకో ర్టు తీర్పు ఇవ్వనుండగా అసలు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ అన్ని పార్టీల నేతల్లో నెలకొంది.
వాస్తవానికి రిజర్వేషన్లు మారాలంటే పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై కోర్టులో కేసు వేయడంతో ఏం జరుగుతుందో… ప్రస్తుత రిజర్వేషన్లే ఉంటాయా లేక మారతాయా అనే విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
అందరిలోనూ ఉత్కంఠ ..
22 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పడకేయడంతో ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలకు లక్షలు పెట్టి గెలిచినా వచ్చే మూడేండ్లలో ఏం చేస్తామనే ధోరణిలో అధికార పార్టీ క్యాడర్ ఉంటే.. అవకాశం ఇస్తే చాలు ..గెలిచి తీరుతామనే ధీమాలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ విషయం ఇలా ఉంటే అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం అందరినీ పట్టిపీడిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యం లో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి పార్లమెంటు ఆమోదం పొందితేనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ దక్కుతుందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండటం, ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లపై జీవో జారీ చేయడంతో కొంతమంది కోర్టుకు వెళ్లిన విష యం విదితమే.
మరి రిజర్వేషన్ అమలవుతుందా లేక 50శాతం లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని కోర్టు సూచిస్తుందా అనే ఆందోళన ఆశావాహుల్లో నెలకొంది. ఒక వేళ ప్రస్తుత రిజర్వేషన్లను కోర్టు కొట్టి వేస్తే పరిస్థితి ఏంటి… కోర్టు వెంటనే ఏదీ తేల్చకుంటే, ఎన్నికల్లో పోటీ చేసిన తరువాత రద్దయితే ..లక్షలు ఖర్చు చేసి గెలిచిని తమ పరిస్థితి ఏంటని ఆశావాహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వేషన్ల విషయంపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుండగా ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఆయా పార్టీల నాయకుల్లో చర్చ జరుగుతోంది. ఇదిలాఉంటే ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే నోడల్ ఆఫీసర్లు, పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం పూర్తి చేసి పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా, సామగ్రిని సిద్ధం చేశారు. అయితే కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో.. ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతాయో తేలాలంటే బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పు వరకు వేచి ఉండాల్సిందే.