ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తది. పటేల్, పట్వారీల వ్యవస్థతో ఇబ్బందులు పడాలె. వీటిని మేము అంగీకరించం. అంటూ రైతులు ముక్త కంఠంతో చెబుతున్నరు. ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు తీరిపోయి.. రైతులు సంతోషంగా ఉండడం నచ్చని కాంగ్రెస్ ధరణిని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నది. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తమంటూ డ్రామాలు ఆడుతున్నది. ధరణి పోతే పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తుంది. లంచావతారులు వస్తరు.
ఏ చిన్నపనికైనా అధికారుల చుట్టూ ఏండ్ల తరబడి తిరగాల్సి వస్తది. పైసలు ముట్టజెప్పందే ఫైలు ముందుకు కదలదు. భూ రికార్డులు మారుతయ్. భూ దందాలు, సెటిల్మెంట్లకు తెరలేపడంతో గొడవలు, ఘర్షణలకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు.
ధరణి పోర్టల్ రాకముందు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టాదారు పాస్‌పుస్తకం ఇలా ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ధరణి తీసుకొచ్చి భూముల వివరాలు ఆన్లైన్ చేయడంతో ఆ తిప్పలు తప్పాయి. ధరణి ఆధారంగానే అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసి రైతుబంధు సాయం అందిస్తున్నరు. భూ సమస్యల కోసం అధికారుల కాడికి పోయే పని లేదు. ఏమన్నా ఉంటే ఆన్లైన్లోనే అర్జీ పెట్టుకుంటే అధికారులే స్వయంగా భూమి కాడికి వచ్చి చూసి పరిష్కరిస్తున్నరు.
కాంగ్రెస్ పాలకులు ఉన్నప్పుడైతే చిన్న పనికి కూడా నెలల తరఫున ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మా పేరున ఉన్న భూమి రేపు ఎవరిపేరున ఉంటదో తెలియని పరిస్థితి ఉండేది. సీఎం కేసీఆర్ సార్ మా బాధలు అర్థం చేసుకుండు కాబట్టే ధరణి తీసుకొచ్చిండు. రైతుల కోసం పని చేసేబీఆర్ఎస్ను గెలిపించుకుంటాం.
-పల్లా శ్రీనివాస్‌రెడ్డి, రైతు, గన్నెర్లపల్లి, చందంపేట మండలం
ధరణి పోతే మళ్లీ దళారులు వస్తరు. ప్రతి పనికి ఒక రేటు పెట్టి రైతులను పీల్చి పిప్పి చేస్తరు. ధరణి వచ్చాక మా భూమి మాకు పక్కాగా కంప్యూటర్లో నమోదై ఉంది. ఊర్లలో గొడవలు లేకుండా పోయాయి. కానీ తాము ధరణి తీసేసి పాత విధానం తీసుకొస్తామని కాంగ్రెస్ వాల్లు చెబుతున్నరు. ధరణి తీసేస్తే మళ్లీ గొడవలు మొదలవుతాయి. కౌలుదారు చట్టంతో కూడా తలనొప్పే. ఒక భూమిలో యజమాని ఒకరుంటే మరొకరు కౌలు దారులు ఉంటారు. మరో చోట కబ్జాదారులు వేరు ఉంటారు.
దాని వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. కానీ ధరణి వచ్చిన తర్వాత అలాంటివి లేకుండా రికార్డుల్లో భూ యజమాని పేరు మీదనే ఉండడంతో రైతులు ప్రశాంతంగా ఉన్నారు. పాత పద్ధతి వస్తే మళ్లీ గందరగోళ పరిస్థితి ఏర్పడి ప్రశాంతంగా ఉన్న గ్రామాలల్లో రైతులు తన్నుకునే రోజులు వస్తాయి. రైతుబంధు కూడా ఎలా ఇస్తారు. ధరణి తీసేస్తే మాలాంటి పేద రైతులకు కష్టాలే మిగులుతాయి. ధరణికే మా మద్దతు ఇస్తాం.
-మర్రి మాధవి, రైతు, ఉరుమడ్ల, చిట్యాల మండలం
ధరణి తీసేసి కౌలుదారు చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. కౌలు చట్టంతో రైతులకు ఇబ్బందులు తప్పవు. పాత పటేల్, పట్వారి వ్యవస్థను తీసుకొస్తే భూ హక్కుదారుడు అన్యాయమైపోతడు. భూమిపైన అతను హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ధరణి వల్ల ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా ఉన్నం. సంతోషంగా ఉన్న రైతులను చూసి కాంగ్రెసోళ్లు ఓర్వడం లేదు. ధరణి ఉన్నట్లయితే రైతు తన భూ పట్టాను మార్పిడి చేయాలంటే యజమాని స్వయంగా ఫింగర్‌ప్రింట్ ఇస్తేనే ఇతరులకు మార్పిడి అయ్యే అవకాశం ఉంటుంది.
పాత పద్ధతి అంటే అధికారులే తమ ఇష్టమొచ్చినట్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 55 ఏండ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ కూడా రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు రైతులకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. భూ రికార్డులను పట్వారీల చేతిలో పెడ్తామంటే రైతులం ఒప్పుకోం. కౌలుదారు చట్టంతో పట్టాదారుల్వెరూ తమ భూములు ఇంకొకరికి కౌలుకు ఇవ్వరు. దాంతో మాలాంటి చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ధరణినిని కొనసాగించే వారికే మేము ఓటేస్తాం.
– ఎడ్ల చందర్రావు, రైతు, అడవిదేవులపల్లి
రైతులను దగాచేసి, డబ్బులిచ్చే వాటికి దన్నుగా ఉండే పట్వారీ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామంటే మేము అంగీకరించం. రైతుకు మేలు చేస్తున్న ధరణి పోర్టల్ ఉండాల్సిందే . కాంగ్రెస్ పాలనలో రైతులు భూమి కొన్న, అమ్మినా, రికార్డుల్లో తప్పులు దొర్లినా అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. వారి చేతులు తడిపితే తప్ప పని అయ్యేది కాదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఆ సమస్యలు లేకుండా పోయాయి. వివరాలన్నీ ఆన్లైన్లో ఉండడంతో క్షణాల్లో పనులవుతున్నాయి. ఏ అధికారిని కలువాల్సిన పని లేదు.
మీసేవా సెంటర్లో స్లాట్ బుక్ చేసుకొని సూచించిన తేదీకి తాసీల్దార్ కార్యాలయానికి వెళితే అరగంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రికార్డుల్లో మార్చి బుక్‌లో ఎంటర్ చేసి ఇస్తున్నరు. ఇందుకు ఏ ఒక్కరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత మంచి ధరణి పోర్టర్‌ను తొలగిస్తామని కాంగ్రేసోళ్లు అనడం వెనుక కొంత మంది ప్రయోజనం దాగి ఉంది. పాత రికార్డు కాలమ్స్ పునరుద్ధరించి కౌలు దారు పేరును కూడా చేర్చడం వల్ల రైతుల మధ్య నిత్యం గొడవలే. మళ్లీ దళారులు, పైరవీకారులు, అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి మాకొద్దు. ధరణి తీసుకొచ్చిన బీఆర్ఎస్కే మేమంతా మద్దతు ఇస్తాం
– బొబ్బ శేఖర్‌రెడ్డి, రైతు, రాయినిపాలెం, మిర్యాలగూడ మండలం
ధరణిని తీసేసి ఇంకోటి పెడ్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నరు. ధరణి లేక పోతే మళ్లీ రైతుల బతుకులు ఆగమే. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వల్లనే భూమి ఎవరి పేరుమీద ఉంది.. ఎంత ఉంది అనేది ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. భూమి అమ్మాలన్నా, ఇతరులకు పట్టా చేయాలన్నా మేము స్వయంగా వెళ్లి వేలి ముద్ర వేస్తేనే అవుతుంది. అది కూడా అరగంటలోనే పూర్తవుతున్నది. ఇదివరకి పట్టా మార్పిడికి నెలలు, సంవత్సరాలు తిరగాల్సి వచ్చేది.
అది కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండా చేసుకునే వీలుంది. ప్రస్తుతం ధరణితో తాసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతున్నాయి. వెంటనే భూమి పత్రాలు ఇస్తున్నారు. అట్లాంటి ధరణిని తీసేస్తామని, పాత కాలం నాటి వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెసోళ్లు చెబుతున్నరు. పాత విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నరనే కొత్త విధానం తీసుకొస్తే దానిని తీసేసి మళ్లీ పాతదే తెస్తామనడం వెనుక అర్థమేంటి. ధరణి తెచ్చిన వాళ్లకు.. ధరణిని కొనసాగించే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు. దానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఓటుతోనే బుద్ధి చెప్తాం.
– కొండారెడ్డి జగాల్‌రెడ్డి, చింతలగూడెం, మాడ్గులపల్లి మండలం