రామగిరి, మే 5 : నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీతోపాటు రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల పరిధిలో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు ప్రభుత్వం కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయి పడింది. వాటి విడుదల కోసం గతేడాది అక్టోబర్ నుంచి ఆయా కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అప్పులు చేసి కళాశాలల నిర్వహణ చేయలేమంటూ గత నెల నుంచి జరుగాల్సిన పలు సెమిస్టర్లు, ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను నిర్వహించకుండా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 2025-26 విద్యా సంవ్సతరంలో పలు కోర్సులో ప్రవేశానికి నిర్వహించే సెట్ పరీక్షలు సమీపిస్తుండడంతో తమ డిగ్రీ పరీక్ష నిర్వహణపై సందిగ్ధం తొలగక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
డిగ్రీ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత తొలగడం లేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం పరీక్షలు నిర్వహించలేమని చేతులెత్తేశాయి. దాంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగాల్సిన డిగ్రీ పరీక్షలు ప్రశ్నార్థకంగా మారాయి. 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ చివరి సెమిస్టర్‌తోపాటు పలు సెమిస్టర్ల విద్యార్థులకు ఏప్రిల్ 2 నుంచి ప్రాక్టికల్స్ జరుగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
గత నెల 11 నుంచి జరుగాల్సిన డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలనూ వాయిదా వేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్చలు జరుపకపోకపోవడం, రీయింబర్స్మెంట్ విడుదలపై స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సుముఖంగా లేవు. ఎంజీయూ పరిధిలో మే 15 వరకు జరుగాల్సిన పరీక్షలు అధికారులు వాయిదా వేయగా తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారు అనేదానిపై ప్రకటనేమీ చేయలేదు. దాంతో డిగ్రీ విద్యార్థులు గందరగోళంలో పడ్డారు.
ఎంజీయూ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ.120కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంజీయూ పరిధిలో గతంలో 140 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. కొవిడ్ ప్రభావం, దోస్త్ ఆన్లైన్ విధానం, ఇతర కారణాలతో ప్రస్తుతం కాలేజీల సంఖ్య 68కి చేరింది. వాటిలో 14వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఫైనల్ ఇయర్ వాళ్లు 6వేలకు పైగా ఉన్నారు. రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉండడంతో కళాశాలల అద్దె, వర్సిటీ ఫీజులు, మున్సిపాలిటీ ట్యాక్స్, అధ్యాపకుల వేతనం, నిర్వహణ ఖర్చు చెల్లించలేక అప్పుల పాలవుతున్నామని ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు వాపోతున్నాయి.
డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఎడ్‌సెట్, ఐసెట్, లాసెట్ వంటి పరీక్షల నిర్వహణ తేదీలు ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డిగ్రీ పరీక్షల నిర్వహణ ఎప్పుడు? అనేది మాత్రం తెలియడంలేదు. మరోవైపు సెట్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఫైనలియర్ విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే విడుదల చేసి కళాశాలల యాజమాన్యానికి భరోసా కల్పించాలి. యూనివర్సిటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించడం లేదు. పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు సమీపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నాం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి.
– మంజుల , పైనల్ ఇయర్ విద్యార్థిని, నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల
ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలి. కళాశాలలను బంద్ చేసి, పరీక్షలు బహిష్కరించి నిరసన తెలుపుతున్నా స్పందించకపోవడం బాధాకరం. కళాశాలలు నడుపలేకపోతున్నాం. అవసరమైతే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలను శాశ్వతంగా ముసి వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించి ఆదుకోవాలి.
– మారం నాగేందరెడ్డి, తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం ఆందోళన చేస్తుండడంతోనే పరీక్షలను ఎంజీయూ పరిధిలో ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశాం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకే మళ్లీ నిర్వహణ తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తర్వులు లేకుండా పరీక్షల పునఃనిర్వహణ షెడ్యూల్ ప్రకటించి విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దనే తేదీలు వెల్లడించడం లేదు.
-జి.ఉపేందర్‌రెడ్డి, ఎంజీయూ సీఓఈ