ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే ముందుగా మీకు ఓటు ఉండాలి. అందుకే ఓటర్ల జాబితాలో మీ పేరుందో.. లేదో పరిశీలించుకోండి. అందుకు ఎన్నో విధానాలున్నాయి. వాటి ద్వారా చూసుకుని.. ఒక వేళ జాబితాలో మీ పేరు లేకుంటే ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
– నేరేడుచర్ల, ఆగస్టు 10
పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా చూసుకోవచ్చు
https//ceo.telangana.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయగానే పై భాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అసెంబ్లీ, నియోజకవర్గం అనే విభాగం కనిపిస్తుంది. వాటిపై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తారో చూసుకుని ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించి మీ పేరుందా? లేదా చూసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లోని పై భాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్’ అనే ఉప కాలం ఉంటుంది.
ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య పొందుపర్చి..
https//voteportal.cci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ‘సెర్స్ ఇన్ ఎలక్టోరల్’ కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను ఎంటర్ చేయాలి. జాబితాలో మీ పేరు ఉందా.. లేదా? ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నది. సీరియల్ నంబర్ ఎంత? వంటి వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఫొటో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్య తెలియకపోతే ‘అడ్వాన్స్ సెర్చ్’ కాలంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం పేరు వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా? తెలుసుకోవచ్చు.
హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లో..
గూగుల్ ప్లే స్టోర్‌లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన voter Helpline మొబైల్ యాప్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నంబర్ వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. యాప్‌లోకి ప్రవేశించిన వెంటనే పైభాగంలో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్’, ‘సెర్చ్ బై ఎలక్టోరల్ నంబర్’ అనే నాలుగు కాలాలు కనిపిస్తాయి. వాటిలో మొదటి రెండు విభాగాలకు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా తెలుసుకోవచ్చు. మీ పేరు, తండ్రి పేరు, వయస్సు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపర్చడం ద్వారా జాబితాలో పేరు ఉందా? లేదా? తెలుసుకోవచ్చు.
న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ విభాగంలోకి ప్రవేశించి..
https//voterportal.eci.gov.in వెబ్సైట్లోకి వెళ్లి మొదట మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. వెబ్సైట్లోకి ప్రవేశించిన వెంటనే న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ విభాగంపై క్లిక్ చేసుకుంటూ వెళ్లి.. దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలి.
పోలింగ్ కేంద్రాల వద్ద చూసుకోవచ్చు
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ అధికారి (బీఎల్ఓ) ఉంటారు. వారి వద్ద ఈ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ఉంటుంది. వాటిని పరిశీలించి మీ ఓటు ఉందా.. లేదా? చూసుకోవచ్చు.
ఓటరు జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు ఇలా..
మీ పేరు, వివరాల నమోదు ఇలా..
www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్తే ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే కాలం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డిటెయిల్స్’, ‘సెర్చ్ బై ఎలక్టోరల్ నంబర్’ అనే రెండు ఉప కాలాలు ఉంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు లేదా ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు.
ఎన్వీఎస్పీ వెబ్సైట్లోకి వెళ్లి…
www.nvsp.in వెబ్సైట్లోకి వెళ్లి ముందుగా మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. వెబ్సైట్లోకి ప్రవేశించిన వెంటనే పక్కనే ‘రిజిస్టర్ యాజ్ ఏ న్యూ ఓటర్’ విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఫారం-6 అప్లికేషన్ ఫామ్ ఫర్ న్యూ ఓటర్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఆన్లైన్ దరఖాస్తు వస్తుంది. అందులో పేర్కొన్న వివరాలన్నింటినీ నింపి సబ్మిట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. ఆన్లైన్ చేసుకున్న దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్‌స్థాయి అధికారి మీ చిరునామాకు వచ్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకన్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేర్చుతారు.
ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్‌తో…
ప్లే స్టోర్‌లో భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన voter Helpline మొబైల్ యాప్ దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్, ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకుని లాగిన్ కావాలి. ఓటరు రిజిస్ట్రేషన్ విభాగంలోకి వెళ్తే న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అనే విభాగం వస్తుంది. దానిపై క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలన్నీ నింపి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. https//ceotelangana.nic.in వెబ్సైట్లోకి వెళ్లి ఎన్వీఎస్పీ ఓటరు పోర్టల్ వెబ్సైట్ లింక్‌లోకి వెళ్లి కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు సహా ఇతరత్రా ఏమైనా సందేహాలుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.