మునుగోడు, మార్చి 18 : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులా? విద్యార్థుల స్వేచ్ఛ హరించేలా సర్క్యూలర్ల జారీ ఇదేం ప్రజా పాలన అని బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బంగారు రవి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను నిరసిస్తూ రవి మాట్లాడారు. నియంత పాలనా రేవంత్ సర్కార్ పోలీస్ అక్రమ అరస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ది ప్రజా పాలనా కాదు అని ప్రజా నిర్భంద పాలన అని దుయ్యబట్టారు.
సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయం అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డి దారిన రావచ్చు.. కానీ ఓయూ విద్యార్థులు విద్య, నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిస్తే తప్పా అని ఆయన ప్రశ్నించారు. విద్యాశాఖను సీఎం తనదగ్గర పెట్టుకుని యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని రద్దు చేసే కుట్రలు మానాలని డిమాండ్ చేశారు. వంద సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిర్భందాలను కొనసాగించలేదన్నారు.
ముల్కి ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం, సామజిక ఉద్యమాలకు ప్రజల తరుపున మాట్లాడే గొంతుకలు ఓయూ విద్యార్థులు అలాంటి విద్యార్థుల స్వేచ్ఛ హరించే సర్క్యూలర్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ప్రోగ్రాంలకు అనుమతులు అవసరం లేదు కానీ సమస్యల మీద మాట్లాడితే కేసులా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ పులిపాలుపుల గ్రామ శాఖ అధ్యక్షుడు ఓరుగంటి శంకర్, బండారు శ్రీనివాస్, శ్రీశైలం, సురేశ్ పాల్గొన్నారు.