సూర్యాపేట, సెప్టెంబర్ 5 : 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అంటూ ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలతో పాటు విద్యార్థులను మోసం చేశాడని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నినదించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ, విద్యార్థులకు స్కూటీలు ఎక్కడ, యువతకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నిరసన ర్యాలీ తీశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఎర్రటి ఎండలో సుమారు 5 కిలోమీటర్ల మేర వెయ్యి మంది విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వాణిజ్య భవన్ వద్ద విద్యార్థులు, యువతను ఉద్దేశించి మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 16, 978 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్నారు. నిరుద్యోగులకు నెలకు 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వకుండా నిరుద్యోగులకు రూ.40 వేల 920 కోట్లు బాకీ పడ్డాడని తెలిపారు.
నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న అబద్ధాల మాటలు ఇక ఆపాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెబితే వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని నేటికీ స్కూటీల జాడలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9 వేల కోట్ల బకాయిలు ఉంటే ఇవ్వకపోవడతో విద్యార్థిలు, తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆవేదన చెందుతున్నారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్ల కేటాయించి అభివృద్ధి చేస్తామన్నావు ఎక్కడా అభివృద్ధి అని ప్రశ్నించారు. యూత్ డిక్లరేషన్ ఎక్కడ ఉంది, ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కింద రూ.5 లక్షల కార్డు ఏదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై అసెంబ్లీలో తమ నాయకులు కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి అండగా ఉంటూ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. రెండేళ్లలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మనందరి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున, పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లట్లపల్లి శోభన్ బాబు, నాయకులు కీసర వేణుగోపాల్, బొడ్డు కిరణ్, సోమగాని వేణు గౌడ్, చామకూరి మహేందర్, సునీల్, సందీప్, శివ, నెల్లుట్ల ఉపేందర్, మహేష్, స్పందన, మౌనిక, హాసిని పాల్గొన్నారు.

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి రేవంత్ ?