మోత్కూరు, ఏప్రిల్ 20 : జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మోత్కూరు అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొన్నిచోట్ల వర్షపు నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. జిల్లాలో నెల రోజులుగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కువ మంది రైతులు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసుకొని కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాంటాలు సక్రమంగా కాకపోవడంతో రైతులు రాశుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో ఈదురుగాలులతో కురిసిన వానకు ధాన్యం తడిసి ముద్దయింది. గాలికి మామిడి కాయలు నేలరాలడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌తోపాటు పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వరద నీటికి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వలిగొండ : మండలంలోని టేకులసోమారం, పహిల్వాన్పూర్ గ్రామాల్లో అర్ధగంటపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు టేకులసోమారం వద్ద భువనగిరి – నల్లగొండ ప్రధాన రహదారికి అడ్డంగా భారీ వృక్షాలు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పహిల్వాన్పూర్ – టేకులసోమారం గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లను పోలీసులు జేసీబీలతో తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
మోటకొండూర్ : మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. చాడ గ్రామంలో ఈదురుగాలులకు చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. విషయం తెలుసుకున్న పోలీసులు చెట్లను తొలగించారు.