మునుగోడు, ఏప్రిల్ 22 : ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురిజా రామచంద్రం అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంటలు నీటిపాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత కల్లోలాలను సృష్టించేందుకు పాటుపడుతుందని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టమే నిదర్శనమన్నారు. గ్రామాల్లో ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం అధిక నిధులు కేటాయించాలన్నారు. ఇంటి స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలని, పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలను అందించాలన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో నూతన పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పెండింగ్లో ఉన్న డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల నీటితో మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని కోరారు. సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను మాట్లాడుతూ.. పార్టీ.బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని, మేడే ఉత్సవాలు గ్రామ గ్రామాన కార్మికులు, కర్షకులు ఘనంగా జరుపుకోవాలన్నారు. ఈ సమావేశానికి బిలాలు అధ్యక్ష వహించగా మాజీ జడ్పిటిసి గోస్కొండ లింగయ్య, మండల సహాయ కార్యదర్శి మందుల పాండు, సింగిల్ విండో డైరెక్టర్, మాజీ సర్పంచ్ ఉప్పునూతల రమేశ్, బిసి హక్కుల సాధన సమితి నాయకులు ఈదులకంటి కైలాస్, ఎండీ జానీ, కాగితం వెంకన్న, దుబ్బ వెంకన్న, కృష్ణయ్య, ఎల్లయ్య, శంకర్, లింగస్వామి, దయాకర్, మందకృష్ణ సత్యనారాయణ పాల్గొన్నారు.