సూర్యాపేట, జూన్ 2 : సమ్మిళిత వృద్ధికి నమూనా తెలంగాణ అని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తెలంగాణకు దిక్సూచి అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలకు మంత్రి ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా అభివృద్ధిని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500కే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు, జిల్లా వ్యాప్తంగా 1,62,718 మంది అర్హత కలిగిన మహిళలకు 4,61,714 సిలిండర్లు ఇవ్వగా వాటికి సబ్సిడీ రూపంలో రూ.13.24 కోట్లు అకౌంట్ ద్వారా జమ చేసినట్లు వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 1,80,607 మంది లబ్ధిదారులకు రూ.78.32 కోట్ల సబ్సిడీ విద్యుత్ ఇచ్చామన్నారు.
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 25,35,964 మంది రైతులను రుణ విముక్తి చేయడం జరిగిందన్నారు. రూ.20,617 కోట్ల రుణమాఫి చేసినట్లు, రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.12 వేల చొప్పున అందించడం జరుగుతుందని చెప్పారు. 2024-25 యాసంగిలో ఇప్పటి వరకు 2,44,423 మంది రైతులకు రూ.227.44 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. సన్న బియ్యంతో ఆకలి తీర్చటం కోసం జిల్లా వ్యాప్తంగా ఒక్కో వ్యక్తికి 6 కేజీల చొప్పున 3,26,057 కుటుంబాలకు 6,258 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసినట్లు వెల్లడించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 4,322 ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
ఎత్తిపోతల పథకంలో భాగంగా రూ.33.80 కోట్ల వ్యయంతో పాలకవీడు మండలం బెట్టితండా వద్ద మూసీ నదిపై బెట్టతండా ఎత్తిపోతల పథకం, రూ.47.64 కోట్ల వ్యయంతో కోదాడ మండలం రెడ్ల కంపట గ్రామం వద్ద పాలేరు నది వద్ద రెడ్లకుంట మేజర్ కాల్వకు రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించామన్నారు. రూ.37.70 కోట్ల వ్యయంతో చింతలపాలెం మండలం నక్కగూడెం ఎత్తిపోతల పథకంలో గల పంపులు, మోటార్లు మరమ్మతులు చేయడంతో పాటు శిథిలమైన పీఎస్సీ పైపులైన్ స్థానంలో ఎంఎస్ పైపులైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులను మంత్రి ఉత్తమ్ సన్మానించారు. అనంతరం మెప్మా ఆధ్వర్యంలో 169 స్వయం సహాయక సంఘాలకు రూ.23.73 కోట్లు, డీఆర్డీఓ ఆధ్వర్యంలో రూ.54 కోట్ల చెక్కులను అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అలాగే పది మంది గౌడ సంఘం సభ్యులకు కాటమయ్య రక్షణ కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహా, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, అందనపు ఎస్పీ రాంబాబు, ఆర్డీఓ వేణుమాదవ్, డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎఫ్ఓ సతీశ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Suryapet : సమ్మిళిత వృద్ధికి నమూనా తెలంగాణ : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి