చౌటుప్పల్, ఫిబ్రవరి 28: మంచినీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఆయన అకస్మికంగా పర్యటించారు. పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుళాయిల ద్వారా సకాలంలో మంచినీటి సరఫరా జరుగుతుందా..? లేదా..? అన్న విషయమై ఆరా తీశారు. తమకు వారానికి ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని స్థానికులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులన్నీ ఎండిపోయాయని కలెక్టర్కు స్థానిక మున్సిపల్ కమిషనర్ కుమార్ రెడ్డి నరసింహారెడ్డి వివరించారు. మిషన్ భగీరథతోపాటు అక్కడక్కడ బోరు బావుల సాయంతో తాగునీరు సరఫరా చేస్తున్నట్లు కుమార్రెడ్డి నరసింహారెడ్డి చెప్పారు. వేసవిలో నీటి సమస్యపై సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హనుమంత రావు సూచించారు.
చౌటుప్పల్లోని వంద పడకల దావఖానను కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. దవాఖాన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆకస్మిక తనిఖీ చేశారు. సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండడంతో వైద్యులపై అయన సీరియస్ అయ్యారు. వారంలో రెండు రోజులు మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డాక్టర్లు, సిబ్బంది తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దవాఖాన వద్ద పిర్యాదు బాక్స్ ఏర్పాటు చేసి ప్రతి సోమవారం సమీక్షిస్తామని తెలిపారు.