సూర్యాపేట టౌన్, జనవరి 28 : ఎన్నికల నియమావళిని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పౌరులు గుంపులుగా చేరవద్దన్నారు. నామినేషన్ కేంద్రాలు పూర్తి సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయన్నారు. పోలీస్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లేకుండా ఓటర్లు స్వేచ్చగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా భద్రత కల్పిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిభందనలు అమలు చేస్తున్నామని, 100 మీటర్ల పరిధిలో బారికేడింగ్ ఏర్పాటు చేశామన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిధిలో గుంపులుగా చేరవద్దని, 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో రెండు చెక్ పోస్ట్ లు, తనిఖీ టీమ్స్ ఉంటాయని వివరించారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్లవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలన్నారు. సమస్యలు సృష్టించే అవకాశమున్న వ్యక్తులను ముందస్తుగా రూ.5 లక్షల వరకు బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే పూచీ నగదును రూ.5 లక్షలు జరిమానా కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, తాసీల్దార్ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి పాల్గొన్నారు.